Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రముఖ దర్శకుడు దివంగత బాలచందర్ ఆస్తులను వేలం వేయనున్నట్టు యుకో బ్యాంక్ విడుదల చేసిన ప్రకటన కోలీవుడ్ లో కలకలం రేపింది. దీనిపై బాలచందర్ కుమార్తె పుష్పా కందస్వామి ఓ ప్రకటన విడుదలచేశారు. బాలచందర్ కు చెందిన కవితాలయ సంస్థ నిర్మించిన ఓ టీవీ సీరియల్ కోసం ఆయన ఇల్లు, కార్యాలయాన్ని 2010లో యూకో బ్యాంకులో తాకట్టు పెట్టారని పుష్ప చెప్పారు. 2015లో సీరియల్ నిర్మాణ పనులు రద్దుచేశామని, డిజిటల్ నిర్మాణ పనులు చేపట్టామని తెలిపారు. మిగిలిన మొత్తాన్ని ఒకేసారి చెల్లించేలా ప్రయత్నం చేస్తున్నామని, ఇదే సమయంలో బ్యాంకు ప్రకటన విడుదలయిందని చెప్పారు.
ఈ విషయంపై కలత చెందాల్సిన పనిలేదని, తాము అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నామని పుష్ప అన్నారు. 2014లో కన్నుమూసిన బాలచందర్ …1970,80ల్లో సినిమా రంగాన్ని మేలిమలుపు తిప్పారు. దాదాపు వంద సినిమాలు తెరకెక్కించిన ఆయన కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా కథలు నడిపించి…ఘనవిజయాలు సొంతం చేసుకున్నారు. కమల్ హాసన్, రజనీకాంత్ , ప్రకాశ్ రాజ్‌తో పాటు అనేకమంది నటీనటుల్ని వెండితెరకు పరిచయం చేసిన బాలచందర్ తర్వాతి రోజుల్లో బుల్లితెరపైనా అనేక సీరియళ్లు రూపొందించారు. ఎంతోమంది నటులు బాలచందర్ ను గురువుగా భావిస్తారు. అలాంటిది… ఆయన మరణం తర్వాత ఆస్తులు వేలానికి వచ్చాయన్న వార్త అందరినీ కలిచివేసింది.