Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సోషల్ మీడియాలోనూ, సొంత అభిమానుల్లోనూ ఆగ్రహం వ్యక్తమవుతున్నా… హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ తన తీరు మార్చుకోవడం లేదు. పబ్లిక్ ఈవెంట్స్ లో భావోద్వేగాలను నియంత్రించుకోవాల్సిన సెలబ్రిటీ స్థాయిలో ఉన్న బాలకృష్ణ ఓ సాధారణ వ్యక్తిలా ఇష్టమొచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నాడు. గతంలో తనతో సెల్ఫీ దిగడానికి వచ్చిన అభిమాని మీద, సినిమా షూటింగ్ అసిస్టెంట్ మీద బాలకృష్ణ చేయిచేసుకున్న ఘటనలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. సోషల్ మీడియాలో బాలకృష్ణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వీరాభిమానులు సైతం బాలకృష్ణ వైఖరిని తప్పుబట్టారు. అప్పట్లో బాలకృష్ణను ఉద్దేశిస్తూ ఓ అభిమాని రాసిన లేఖ సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. బుద్ధి మార్చుకోవాలని ఆ అభిమాని తన లేఖలో బాలయ్యకు హితవు పలికారు. ఇంత జరిగిన తరువాత కూడా బాలకృష్ణ వైఖరిలో మార్పు రాలేదు.
ప్రజల మధ్యకు వచ్చినప్పడు కోపాన్ని అదుపులో పెట్టుకోవాలన్న స్ఫృహ లేకుండా ప్రవర్తిస్తున్నారు. తాజాగా… సొంత నియోజకవర్గం హిందూపురంలోనూ బాలయ్య మరోసారి దురుసుగా ప్రవర్తించారు. టీడీపీ కార్యకర్త ఒకరిని బాలకృష్ణ కొట్టాడు. ఇంటింటీకీ టీడీపీ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ హిందూపురంలోని బోయపేటలో పర్యటిస్తున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు, బాలకృష్ణ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ క్రమంలో బాలకృష్ణ ఓ ఇంట్లోకి వెళ్తుండగా… ఆయన కంటే ముందు ఓ టీడీపీ కార్యకర్త లోపలికి వెళ్లడానికి ప్రయత్నించాడు. దీంతో అసహనానికి లోనయిన బాలకృష్ణ ఆ కార్యకర్త చెంప చెళ్లుమనిపించాడు. ఎందుకంత తొందరంటూ ఆగ్రహం వ్యక్తంచేశాడు. బాలకృష్ణ ప్రవర్తనను టీడీపీ కార్యకర్తలే కాక… ఆయన అభిమానులు సైతం తప్పుబడుతున్నారు.