మరోసారి వార్తల్లోకి ఎక్కిన బాలకృష్ణ

మరోసారి వార్తల్లోకి ఎక్కిన బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. తన రూటే సెపరేటు అన్నట్లు సాగిపోయే బాలయ్య.. తాజాగా సినీ పరిశ్రమలో కార్యకలాపాలు పున:ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఇండస్ట్రీ పెద్దలు నిర్వహించిన సమావేశానికి తనను పిలవకపోవడంపై బాలయ్య కినుక వహించడం ఆశ్చర్యం కలిగించే విషయమే.

బాలయ్య ఈ ఇష్యూను అంత సీరియస్‌గా తీసుకుంటాడని ఎవ్వరూ అనుకోలేదు. అసలు బాలయ్యను పిలిచినా ఈ కార్యక్రమాలకు వచ్చేవాడా అన్నదీ సందేహమే. అలాంటిది తనను పిలవకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాళ్లందరూ ‘రియల్ ఎస్టేట్’ సెటిల్మెంట్ల కోసం వెళ్లారంటూ అనవసర వ్యాఖ్య చేసి దొరికిపోయాడు బాలయ్య. దీనిపై తీవ్ర విమర్శలే వ్యక్తమవుతున్నాయి. తనను పిలవకపోవడంపై అభ్యంతరాలు వ్యక్తం చేయవచ్చు కానీ.. ఇలాంటి ఆరోపణలు చేయడం మాత్రం తీవ్ర అభ్యంతరకరమే.

ఈ సందర్భంలో బాలయ్యను తప్పుబడుతున్న వాళ్లు.. పాత విషయాలు బయటికి తీస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా అనంతపురం జిల్లాలో బాలయ్య నేతృత్వంలో లేపాక్షి ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా ఈ వేడుకలకు చిరంజీవికి ఆహ్వానం పంపారా అని బాలయ్యను అడిగితే.. ఆయన శ్రుతి మించి మాట్లాడారు.

ఆహ్వానం పంపలేదు అనేసి ఊరుకోకుండా.. ఎవరిని పిలవాలో, ఎవరిని పిలవకూడదో తనకు తెలుసని… ఇది తన కష్టార్జితం అని.. ఎలా చేయాలో తనకు బాగా తెలుసని బాలయ్య వ్యాఖ్యానించాడు. అప్పట్లో ఆ వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. తమ పార్టీ అధికారంలో ఉండగా బాలయ్య అలా హద్దుమీరి మాట్లాడి.. ఈ రోజు తనను పిలవలేదని అలగడం ఏం న్యాయమని ప్రశ్నిస్తున్నారు యాంటీస్. అప్పటి వీడియోతో ఇప్పుడు బాలయ్యను గట్టిగానే ట్రోల్ చేస్తున్నారు ఆయన వ్యతిరేకులు.