బాలయ్య… కాస్త ఆలోచించయ్యా?

Balakrishna Jai Simha Movie Public Talk

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
నందమూరి బాలకృష్ణ గత కొంత కాలంగా మూస కథలతో, రెగ్యులర్‌ ఫార్మట్‌లలో సినిమాలు చేస్తూ ఉన్నాడు. ఏమాత్రం ఆకట్టుకోని కథనాలతో, అన్ని సినిమాల్లో ఒకేరకమైన పాత్రలతో బాలయ్య నటిస్తూ వస్తున్నాడు. గత సంవత్సరం సంక్రాంతికి విడుదలైన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రం కాస్త గుడ్డిలో మెల్ల అన్నట్లుగా ఉండి ఆయన కెరీర్‌కు ఊపిరి ఊదింది. ఆ తర్వాత వచ్చిన పైసా వసూల్‌ మరియు తాజాగా వచ్చిన ‘జైసింహా’ చిత్రాలు అదే రొటీన్‌ ఫార్మట్‌లో ఉంది. బాలయ్య అనగానే ఒక రకమైన ఆలోచనతో ప్రేక్షకులు ఉండి పోయారు. వారి అంచనాలను అందుకోవడంలో బాలకృష్ణ ప్రతీ సారి ఫెయిల్‌ అవుతూనే వస్తున్నాడు.

‘జైసింహా’ వంటి కథ తెలుగులో 1980లో వచ్చింది. అప్పట్లో ఆ ఫ్లాట్‌కు మంచి స్పందన ఉండేది. కాని కాలం మారిపోయింది. 30 సంవత్సరాలు ముందుకు వచ్చేశాం. ఇంకా కూడా అక్కడే ఉంటాం, అలాంటి సినిమాలే చేస్తాను అంటూ ఫలితాలు తారు మారు అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకే బాలయ్య కథల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్లుగా, తన వయస్సుకు తగ్గట్లుగా కథలు ఎంచుకోవాలని స్వయంగా నందమూరి ఫ్యాన్స్‌ సూచిస్తున్నారు.

ఆరు పదుల వయస్సు దాటిన తర్వాత కూడా ఇంకా 30 ఏళ్ల వ్యక్తి పాత్రను చేస్తాను అంటే ప్రేక్షకులు అన్ని సందర్బాల్లో ఒప్పుకోరు. వయస్సుకు తగ్గట్లుగా కూడా పవర్‌ ఫుల్‌ పాత్రలు చేసే అవకాశం ఉంటుంది. అలాంటి కథలు ఎంచుకుని సినిమాలు చేయాలని బాలకృష్ణకు సలహా ఇస్తున్నారు. ముందు ముందు అయినా సినిమాల ఎంపిక మరియు దర్శకుల ఎంపిక విషయాల్లో బాలయ్య జాగ్రత్త తీసుకోవాలని సగటు నందమూరి ఫ్యాన్‌ కోరుకుంటున్నాడు. మరి బాలయ్య జాగ్రత్త తీసుకుంటాడా లేదా అనేది చూడాలి. జాగ్రత్త పడకుంటే మరి కొన్నాళ్లకు బాలయ్య పూర్తిగా సినిమాలకు దూరం అవ్వాల్సిన పరిస్థితి వస్తుందని సినీ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.