ఎన్టీఆర్‌’ విషయంలో ఆలోచనలో పడ్డ బాలయ్య ?

balakrishna-plannings-on-ntr-biopic-script

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

నందమూరి బాలకృష్ణ తన తండ్రి ఎన్టీ రామారావు జీవిత చరిత్రతో ఒక చిత్రాన్ని చేసేందుకు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇప్పటికే సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి, సినిమా టైటిల్‌లోగోను కూడా ఇటీవలే ఆవిష్కరించారు. తేజ దర్శకత్వంలో సాయి కొర్రపాటి, విష్ణులతో కలిసి స్వయంగా బాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ఈ చిత్రం కోసం నందమూరి ఫ్యాన్స్‌తో పాటు తెలుగు వారు అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుగు వారి ఆరాధ్య దైవంగా పిలువబడే ఎన్టీఆర్‌ జీవిత చరిత్రతో సినిమా అంటే చాలా కీలక పరిణమాలు చూపించాల్సి ఉంటుంది. కొన్ని విమర్శలు, కొన్ని వివాదాలు కూడా సినిమాలో ఉండే అవకాశం ఉంది. ఎన్టీఆర్‌ జీవితంలో కొన్ని చేదు సంఘటనలు కూడా ఉన్నాయి. వాటిని చూపించే విషయంలో బాలయ్య ఆలోచనల్లో పడ్డట్లుగా తెలుస్తోంది.

మొన్నటి వరకు ‘ఎన్టీఆర్‌’ చిత్రాన్ని ఫిబ్రవరి లేదా మార్చిలో సెట్స్‌పైకి తీసుకు వెళ్లాలని భావించిన బాలయ్య ఇప్పుడు ఆలోచనల్లో పడ్డట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే రెడీ అయిన స్క్రిప్ట్‌ విషయంలో మరోసారి చర్చు జరపాలని, కథ మరియు కథనంలో మార్పులు చేయాలని నిర్ణయించుకున్నాడు. తన తండ్రి ఎన్టీఆర్‌ జీవిత చరిత్రను అంత సులభంగా తెరకెక్కించడం సాధ్యం కాదని, అందుకు చాలా గ్రౌండ్‌ వర్క్‌ జరగాలని తాజాగా జరిగిన ఒక కార్యక్రమంలో చెప్పుకొచ్చాడు. స్క్రిప్ట్‌పై మరింత కాలం పని చేసి ఆగస్టు నుండి చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకు వెళ్లాలని భావిస్తున్నట్లుగా బాలయ్య చెప్పుకొచ్చాడు. ఈ ఏడు నెలల్లో ‘ఎన్టీఆర్‌’ చిత్రం కోసం ఎలాంటి స్క్రిప్ట్‌ను తయారు చేస్తారో చూడాలి. బాలయ్య తీరు చూడబోతుంటే 2018లో ‘ఎన్టీఆర్‌’ చిత్రం వచ్చేలా లేదని సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.