Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మనసులో ఏముందో నోటితో అదే మాట్లాడ్డంలో బాలకృష్ణ ముందు వరసలో వుంటారు. ఆయన నడుస్తున్న సినీ, రాజకీయ రంగాలు రెండిటికీ ఈ తరహా మాటలు ఏ మాత్రం సరిపడవు. అయినా ఆయన ధోరణి మార్చుకోరు. అభిమానుల మీద చెయ్యి చేసుకుంటున్నారని మీడియా కోడై కూసింది. అందరు హీరోల్లా నేను ఆ పని బౌన్సర్లు తో చేయిస్తే నాకు చెడ్డ పేరు రాదు కానీ నా ఎమోషన్ నేనే అనుభవిస్తా, ఆస్వాదిస్తా, అవసరం అయితే ఇబ్బంది పడతా అని చెప్పే బాలయ్య గురించి ఇంకా ఏమి చెప్పగలం. అలాంటి బాలయ్య ఇప్పుడు పరిటాల రవి గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
అనంతపురం జిల్లా పెనుగొండలో మడకశిర కూడలి వద్ద ఏర్పాటు చేసిన నందమూరి తారకరామారావు విగ్రహాన్ని బాలకృష్ణ నేడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పెనుగొండ రాజకీయాలు, పరిటాల రవి గురించి బాలయ్య కొన్ని కామెంట్స్ చేశారు. టీడీపీ ఆవిర్భావానికి ముందు పెనుగొండలో అరాచక శక్తులు రాజ్యం ఏలుతుండేవని బాలయ్య అన్నారు. ఆ శక్తుల ఆట కట్టించడానికి పరిటాల రవిని ఎన్టీఆర్ రాజకీయ రంగంలోకి దించారని బాలయ్య నాటి పరిస్థితుల్ని గుర్తు చేసుకున్నారు. ఒకప్పుడు అరాచకాలతో అట్టుడుకిన పెనుగొండ రవి రాజకీయాల్లోకి వచ్చాక అభివృద్ధి ఫలాల రుచి చూసిందని బాలయ్య కితాబు ఇచ్చారు. ఎన్టీఆర్ కడుపున పుట్టడం, ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం తన పూర్వజన్మ సుకృతమని బాలయ్య చెప్పుకొచ్చారు. ఒక్క అనంతపురం జిల్లా మాత్రమే కాకుండా రాయలసీమలో పెద్ద ఎత్తున పరిశ్రమల స్థాపనకు చంద్రబాబు చేస్తున్న కృషిని బాలయ్య ప్రశంసించారు. అనంతపురం జిల్లా నుంచే రాజకీయ ప్రయాణం చేస్తున్న బాలయ్య పరిటాల రవి గురించి మాట్లాడిన అరుదైన సందర్భాల్లో నేటి పెనుగొండ సభ ఒకటి.