Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కుమార్తె బ్రాహ్మణిని లోకేష్ కి ఇచ్చి పెళ్లి చేయకముందు నటసింహం ఎక్కడికి వెళ్లినా ఆయన ఫ్యాన్స్ కాబోయే సీఎం అంటూ పెద్ద పెట్టున అరిచేవాళ్ళు. ఆ అరుపులు వినగానే బాలయ్య మొహం మీద ముసిముసినవ్వులు కనిపించేవి. పైగా దేవుడు ఎలా రాసిపెడితే అలా జరుగుతుందని కొద్దిపాటి ఫిలాసఫీ తో బాలయ్య ఆ సీన్ కి కట్ చెప్పేవాళ్ళు. అప్పట్లో రొటీన్ అయిన ఈ సీన్ లోకేష్, బ్రాహ్మణి పెళ్లి తర్వాత కనిపించడం లేదు. వినిపించడం లేదు. అయితే బాలయ్య లో పాత జ్ఞాపకాలు, ఆ మోజు అలాగే ఉండిపోయిందేమో. అదను చూసి చంద్రబాబు, లోకేష్ విదేశాలకు వెళ్లిన టైం చూసి సీఎం కుర్చీ మోజు తీర్చేసుకున్నారు. అదెలా సాధ్యమో ఈ ఫోటో చూస్తే అర్ధం కావడం లేదూ…
హిందూపురం ఎమ్మెల్యేగా వున్న బాలయ్య లేపాక్షికి సంబంధించిన ఓ పని మీద అధికారులు, మంత్రితో సమావేశం కావాల్సివుంది. ఈ భేటీ సీఎం క్యాంపు ఆఫీస్ లో జరుగుతుందన్న సమాచారం వచ్చింది. మంత్రి దేవినేని ఉమతో పాటు సీనియర్ అధికారులు కూడా ఆ సమావేశానికి వచ్చారు. అక్కడికి వచ్చిన బాలయ్య సీఎం చంద్రబాబు కుర్చీలో కూర్చుని మీటింగ్ కానిచ్చేశారు. బాలయ్య ఆ సీట్ లో కూర్చోవడంతో అధికారులు ఆశ్చర్యపోయినా అభ్యంతరం మాత్రం చెప్పలేకపోయారు. మొత్తానికి ఈ సమావేశం జరిగినంత సేపు సీఎం కుర్చీలో కూర్చోవాలన్న బాలయ్య మోజు తీరిపోయింది. అయితే ఇది పద్ధతి కాదు అనే విమర్శలు అంతే వేగంగా వచ్చాయి.