విజయవాడ రాజకీయం వేడెక్కింది. ఎంపీ కేశినేని నాని, వైసీపీ నేత పీవీపీ మధ్య ట్వీట్ల యుద్ధం మరింత ముదిరింది. బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ సమస్యపై ముఖ్యమంత్రి జగన్ టార్గెట్‌గా కేశినేని ట్వీట్ చేస్తే అదే రేంజ్‌లో పీవీపీ విజయవాడ ఎంపీకి కౌంటరిచ్చారు. ముందు కేశినేని ఏ పార్టీలో ఉన్నాడో చెప్పాలంటూ పీవీపీ సెటైర్లు పేల్చారు.
సమాజం సంగతి తర్వాత ముందు ట్రావెల్స్‌లో పనిచేసిన కార్మికులకు జీతాలు ఇవ్వాలంటూ సలహా ఇచ్చారు. ‘ఒట్టి మాటలు కట్టుబెట్టి గట్టి మేలు తలపెట్టవోయి.. సొంత లాభం కొంత మానుకుని.. పొరుగు వానికి తోడుపడవోయ్.. దేశమంటే తెలుగుదేశం కాదోయ్.. నువ్వు జీతాలు ఎగొట్టిన కార్మికులు కూడా మనుషులోయ్.. కాస్త వారి కష్టాలు చూడవోయ్ !!’అంటూ పీవీపీ కేశినేనినికి చురకలు అంటించారు.
పరోక్షంగా ట్రావెల్స్‌లో పనిచేసిన ఉద్యోగులకు ఇవ్వాల్సి బకాయిల్ని చెల్లించమన్నారు. ‘బండ బాబాయ్, నీ బస్సు స్టీరింగ్ ముందు కూర్చొని, నీ బోర్ కి వచ్చిన బండిని టీడీపీ షెడ్డుకు తీసుకెళ్తావా లేక బీజేపీ షెడ్డుకా ముందు చెప్పు.. ఆ తరువాత జనాల సమస్యలు ఏ మాత్రం తీరుస్తావో మేము చూస్తాం.. ప్రతి బుడబుక్కలోడు వాగేవాడు అయిపోయాడు మన ప్రజల కర్మ..’అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.