తాను దేవుడిలా భావించి ఎంతో అభిమానించే పవన్ కల్యాణ్ స్థాపించిన పార్టీ జనసేనలో చేరకుండా, నిర్మాత బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీ లో చేరిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఉదయం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరిన బండ్ల గణేష్, అనంతరం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ లో చేరడం, అదికూడా రాహుల్ సమక్షంలో చేరడం తనకెంతో సంతోషాన్ని కలిగించిందని వ్యాఖ్యానించిన ఆయన, తాను అసెంబ్లీకి పోటీ పడే విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానానిదే తుది నిర్ణయమని తెలిపారు. పార్టీ పోటీ చేయమంటే పోటీ చేసేందుకు తాను సిద్ధమని, లేకుంటే లేదని చెప్పారు. త్యాగాలకు మారుపేరు కాంగ్రెస్ పార్టీ అని, తెలంగాణను ఇచ్చింది కూడా ఆ పార్టీయేనని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ తప్పకుండా దేశ ప్రధాని అవుతారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
అలాగే జనసేనను కాదని కాంగ్రెస్ ను ఎందుకు ఎంచుకున్నారని బండ్ల గణేష్ న అడగగా తాను చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ అభిమానినని తెలిపిన ఆయన, తన ఆరేళ్ల వయసులో ఇందిరాగాంధీని హత్య చేశారని, ఆపై శ్రీపెరంబుదూరులో రాజీవ్ గాంధీని హత్య చేశారని, ఆ ఘటనలన్నీ తనకు తెలుసునని చెప్పారు. తాను ఎప్పుడు ఓటు వేసినా కాంగ్రెస్ పార్టీకే ఓటేశానని వెల్లడించిన ఆయన, పవన్ కల్యాణ్ అంటే తనకెంతో అభిమానమని, ఆయన బాగుండాలని, ఆయన పార్టీ బాగుండాలని కోరుకుంటున్నానని చెప్పారు. తనకు సినిమారంగమంటే ప్రాణమని, తనను ఆదరించి, ఆశీర్వదించిన తండ్రి వంటి వ్యక్తి పవన్ కల్యాణ్ అని చెప్పిన బండ్ల, రాజకీయాల్లోకి రావాలంటే ఆయన పార్టీనే ఆశ్రయించాలని ఏమీ లేదని అన్నారు. ఆయన తనకు దేవుడు వంటివారని, ఆయన గురించి ఇప్పుడేమీ మాట్లాడలేనని చెప్పారు.