Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వరకట్న దురాచారం సమాజంపై ఎంత దుష్ప్రభావం చూపిస్తోందో ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. 1961లోనే భారత ప్రభుత్వం వరకట్నానికి వ్యతిరేకంగా చట్టంచేసింది. 60 ఏళ్లు గడుస్తున్నా… ఈ దురాచారానికి ఇంకా తెరపడలేదు. ప్రతిరోజూ పత్రికల నిండా, టీవీ చానళ్ల నిండా వరకట్న వేధింపులకు అమాయక మహిళలు బలైపోతున్న వార్తలు కనిపిస్తూనే ఉన్నాయి. పేద, ధనిక అన్న తేడాలేకుండా… అన్ని వర్గాల్లోనూ వరకట్న సమస్య ఉంది. ఆధునిక ప్రపంచంలోనూ అమ్మాయిలకు కట్నం ఇవ్వడం సామాజిక హోదాకు చిహ్నంగా మారింది. ఈ దురాచారాన్ని రూపుమాపేందుకు ప్రభుత్వం, స్వచ్చంద సంస్థలు దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా చేస్తున్న కృషి ఎలాంటి ఫలితాన్నివ్వడం లేదు.
వరకట్నంపై సమాజంలో చెడ్డ అభిప్రాయమే ఉన్నప్పటికీ కట్నం తీసుకోకుండా పెళ్లిచేసుకునేందుకు మాత్రం అబ్బాయిలు ముందుకు రావడం లేదు. అమ్మాయిల తల్లిదండ్రులూ తాహతుకు మించి కట్నమిచ్చి పెళ్లిచేస్తున్నారు. అయినా అన్ని పెళ్లిళ్లూ సుఖాంతం కావడం లేదు. అదనపు కట్నం కోసం అమ్మాయిలు అత్తవారింట్లో ఆరళ్లకు గురవుతున్నారు.
తెలుగు రచయిత కలేకూరి ప్రసాద్… వరకట్న దురాచారం అమ్మాయిల జీవితాలను ఎలా కాలరాస్తోందో… కర్మభూమిలో పాటలో హృదయవిదారకంగా వివరించారు. ఆ పాట తెలుగునాట సూపర్ హిట్టయ్యింది. కొన్నేళ్లపాటు…ఏ బాధాకర సందర్భమొచ్చినా…కర్మభూమిలో పూసిన ఓ పువ్వా అన్న పాట వినిపించింది. అయినా సరే వరకట్న దురాచారం మాత్రం ఆగలేదు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు..దేశవ్యాప్తంగా ఉన్న ఈ సమస్యను పారదోలేందుకు అందరూ కలిసి కట్టుగా కృషిచేయాల్సిన అవసరం ఉంది. సమాజంలో భాగమైన ప్రతి ఒక్కరిపైనా ఈ బాధ్యత ఉంది. ఇక విద్యార్థులను మంచి వ్యక్తిత్వంతో తీర్చిదిద్దాల్సిన కళాశాలలు మరింతగా ఈ దురాచారానికి వ్యతిరేకంగా ప్రచారం చేయాలి. కానీ… బెంగళూరు లోని ఓ కాలేజ్ మాత్రం అత్యంత బాధ్యతా రహితంగా ప్రవర్తిస్తోంది. సమాజాన్నిపట్టిపీడిస్తున్న దురాచారాన్ని పాఠ్యపుస్తకాల్లో చేర్చి మరీ బోధిస్తోంది. ఆ పాఠ్యాంశాలు చెబుతోంది వరకట్నం తీసుకోవద్దని కాదు… కట్నం తీసుకుంటే కలిగే ప్రయోజనాల గురించి… ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం.
బెంగళూరులోని సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఈ ఘనకార్యాన్ని నిర్వహిస్తోంది. సోషియాలజీ పాఠ్యాంశాల్లో భాగంగా… వరకట్నం వల్ల కలిగే ఏడు ఉపయోగాలను వివరిస్తోంది. ఆ ఏడు ప్రయోజనాలు ఏంటంటే… ఎక్కువ కట్నం ఇవ్వడం వల్ల అందవిహీనంగా ఉండే అమ్మాయిల పెళ్లిచేయవచ్చట. అందమైన అబ్బాయిలను ఎక్కువకట్నం ఆశచూపి పెళ్లికి ఒప్పించవచ్చట. కట్నం వల్ల కొత్తగా పెళ్లయిన జంట కలిసి జీవించడానికి ఆర్థిక ఆసరా ఉంటుందట. వరకట్నం మెరిట్ విద్యార్థుల ఉన్నత చదువులకు ఉపయోగపడుతుందట. ఎక్కువ కట్నం ఇచ్చిన అమ్మాయిని అత్తగారింట్లో ఎక్కువ ప్రేమగా చూస్తారట. ఎక్కువ కట్నం ఇచ్చి పెళ్లి చేసిన వారి స్థాయిని సమాజం గుర్తిస్తుందట. అమ్మాయికి తండ్రి ఆస్తిలో వాటా ఇవ్వడం కంటే… కట్నం ఇచ్చి పంపించేస్తేనే మంచిదట. ఇలా వరకట్నం వల్ల కలిగే ఉపయోగాలను పాఠ్యాంశాల్లో చేర్చి… అబ్బాయిలందరినీ కట్నం తీసుకోమని ప్రోత్సహిస్తోంది ఆ కాలేజ్. ఈ నిర్వాకంపై సర్వత్రా విమర్శలు చెలరేగడంతో కాలేజ్ ర్వాహకులు స్పందించారు. ఈ పాఠ్యాంశం సంగతి తాము గమనించలేదని, ఇది పాఠ్యాంశాల్లో ఎలా చేరిందో తెలుసుకోడానికి విచారణ చేపట్టామని, తమ కాలేజ్ ఇలాంటి వాటిని ప్రోత్సహించదని కళాశాల పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ప్రొఫెసర్ కిరణ్ జీవన్ తెలిపారు.