ఇది సోష‌ల్ మీడియా ఎఫెక్ట్

Banjara Hills Karachi Bakery selling food future manufacturing date

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

సోష‌ల్ మీడియా వ‌చ్చిన త‌ర్వాత త‌మ‌కు క‌లిగిన ఇబ్బందులు, ఎదుర్కొన్న అనుభ‌వాల‌ను గ‌తంలోలా ఎవ‌రూ మ‌న‌సులోనే దాచుకోవ‌డం లేదు. సందేహం క‌లిగిన విష‌యాన్నో… అనుమానంగా అన్పించ‌న సంగ‌తుల‌నో సోష‌ల్ మీడియాలో పోస్టు చేసి అంద‌రి దృష్టికి తీసుకువ‌స్తున్నారు. క‌రాచీ బేక‌రీ వివాదం కూడా అలా వెలుగులోకి వ‌చ్చిందే. హైద‌రాబాద్ లో క‌రాచీ బేక‌రీకి ఉండే డిమాండ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. బేక‌రీ ఐటెమ్స్ కు అదిపెట్టింది పేరు. కరాచీ బేక‌రీలో కొనే ఆహార‌ప‌దార్థాల నాణ్య‌త గురించి ఎవ‌రికీ సందేహాలు కూడా ఉండ‌వు. అంత‌లా హైద‌రాబాదీల న‌మ్మ‌కాన్ని పొందిన కరాచీ బేక‌రీ… ఆ న‌మ్మ‌కాన్ని ఆస‌రాగా చేసుకుని… వినియోగ‌దారుల‌ను మోసం చేస్తోంది.

బంజారాహిల్స్ లోని క‌రాచీ బేక‌రీ బ్రాంచ్ లో ఓ వినియోగ‌దారుడు బుధ‌వారం ఓ బ్రెడ్ ప్యాకెట్ కొన్నాడు. దాని మీద డేట్ చూస్తే ఆ బ్రెడ్ ఐదో తారీఖు త‌యారుచేసిన‌ట్టు రాసిఉంది. మూడు రోజుల్లోపు వినియోగించాల‌ని ఉంది. తాను నాలుగో తారీఖు కొన్న బ్రెడ్ ను ఐదో తారీఖు ఎలా త‌యారుచేశారో ఆ వినియోగ‌దారుడికి అర్ధం కాలేదు. గ‌తంలో అయితే ఇలాంటి అనుభ‌వాలు ఎదుర‌యిన‌ప్పుడు కుటుంబ స‌భ్యుల‌కో, స్నేహితుల‌కో ఆ విష‌యం చెప్పి మ‌ర్చిపోయేవారు. కానీ ఇప్పుడు ఇలాంటి విష‌యాల‌ను పంచుకోటానికి సోష‌ల్ మీడియా రూపంలో ఓ వేదిక దొరికిందిగా… వెంట‌నే ఆ వినియోగదారుడు ఆ బ్రెడ్ ను ఫొటో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. నిమిషాల్లోనే ఆ ఫొటో వైర‌ల్ అయిపోయింది. ఎంత‌గా అంటే… తూనిక‌లు, కొల‌త‌ల శాఖ అధికారులు క‌రాచీ బేక‌రీపై దాడులు నిర్వ‌హించేంత‌గా.

హైద‌రాబాద్, రంగారెడ్డి, మేడ్చ‌ల్ జిల్లాల ప‌రిధిలోని 14 క‌రాచీ బేక‌రీల్లో అధికారులు త‌నిఖీలు నిర్వ‌హించారు. ఇందులో నాలుగు బ్రాంచ్ ల్లో 18 ర‌కాల ఫుడ్ ఐటెమ్స్ నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా ఉన్నాయ‌ని, వాటిని త‌యారుచేసిన తేదీల్లో కూడా తేడాలు ఉన్నాయ‌ని గుర్తించి కేసులు న‌మోదుచేశారు. దీంతో క‌రాచీ బేక‌రీ యాజ‌మాన్యం దిద్దుబాటు చ‌ర్య‌లు ప్రారంభించింది. సిబ్బంది నిర్లక్ష్యం వ‌ల్ల స‌మ‌స్య త‌లెత్తింద‌ని, మ‌రోసారి జాగ్ర‌త్త‌లు తీసుకుంటామ‌ని ఫేస్ బుక్ లో వెల్ల‌డించింది. బంజారా హిల్స్ బ్రాంచ్ లో అమ్మిన బ్రెడ్ విష‌యంలో అంటే సిబ్బంది నిర్లక్ష్యం వ‌ల్ల పొర‌పాటు జ‌రిగింద‌నుకోవ‌చ్చు. మ‌రి తూనిక‌లు, కొల‌తలు శాఖ నిర్వ‌హించిన త‌నిఖీల్లో 18 ర‌కాలు ఫుడ్ ఐటెమ్స్ నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఉన్న‌ట్టు తేలింది కదా… దీనికి క‌రాచీ బేక‌రి ఏమ‌ని స‌మాధాన‌మిస్తుందో చూడాలి. మొత్తానికి అంత పేరెన్నిక గ‌న్న కరాచీ బేక‌రి ఆహార ప‌దార్థాల విష‌యంలో క‌న‌బ‌రుస్తున్న నిర్లక్ష్య వైఖ‌రిని సోష‌ల్ మీడియా ఎండ‌గ‌ట్టింది.