గత రెండ్రోజులుగా బ్యాంకులకు సంబందించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే ఈ ఆదివారం నుండి వారం రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు అని. ఆదివారం కావడంతో సెలవు అని, ఆ తర్వాత రోజు సోమవారం కృష్ణాష్టమి అని, ఆ తర్వాత రెండ్రోజులు బ్యాంకు ఉద్యోగుల సమ్మె కాబట్టి పనిచేయవని, ఆ రెండు రోజులు భారతీయ రిజర్వు బ్యాంకు సిబ్బంది మూకుమ్మడి సెలవులు పెట్టే అవకాశం ఉందని ఫలితంగా దేశ్యాప్తంగా బ్యాంకుల కార్యకలాపాలకు ఆటంకం కలుగుతుంది. కాబట్టి ఆ రెండు రోజులు బ్యాంకులు తెరుచుకున్నా లావాదేవీలు జరగకపోవచ్చు అని సోషల్ మీడియా లో తెగ వైరల్ అయ్యింది.
అయితే ఈ విషయం మీద జాతీయ బ్యాంకు ఉద్యోగుల సంఘం స్పందించింది. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వార్తల్లో నిజం లేదని, ఆదివారం మామూలుగానే సెలవు అని, ఇక కృష్ణాష్టమి ఐచ్చిక సెలవు అని ఆ తరువాత బ్యాంక్ ఉద్యోగుల సమ్మె కాదని, సమ్మెకి వెళ్ళేది కేవలం రిజర్వ్ బ్యాంక్ ఉద్యోగులు మాత్రమేనని, అన్ని బ్యాంకులు యధావిధిగా పనిచేస్తాయని వారు చెప్పుకొచ్చారు. ఢిల్లీ, ముంబై తదితర ప్రాంతాల్లో ఆ రోజు బ్యాంకులు తెరిచే ఉంటాయని తెలిపారు. అయితే.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం జన్మాష్టమి సందర్భంగా చాలా బ్యాంకులు సోమవారం సెలవు ప్రకటించాయి..