టీమిండియా టెస్టు సారథ్య బాధ్యతల నుంచి విరాట్ కోహ్లి తప్పుకొన్న తర్వాత క్రికెట్ ప్రేమికుల మెదళ్లని తొలుస్తున్న ప్రశ్న… ‘నెక్ట్స్ కెప్టెన్ ఎవరు?’. పరిమిత ఓవర్ల సారథి, టెస్టు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మకే పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం సాగుతున్నా… కేఎల్ రాహుల్, రిషభ్ పంత్… పేర్లు తెర మీదకు వస్తున్నాయి. వయసు, ఫిట్‌నెస్ రీత్యా బీసీసీఐ హిట్‌మ్యాన్ వైపు మొగ్గు చూపకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సునిల్ గావస్కర్ వంటి దిగ్గజాలు సైతం పంత్ మాత్రం కోహ్లి స్థానాన్ని భర్తీ చేయగలడని అభిప్రాయపడుతున్నారు. దీంతో ఈ ముగ్గురిలో ఎవరు పగ్గాలు చేపడతారనే విషయం ఆసక్తికరంగా మారింది. అయితే, బీసీసీఐ మాత్రం ఈ విషయంపై పూర్తి క్లారిటీతో ఉందట. రోహిత్ శర్మకే టెస్టు కెప్టెన్సీ కూడా అప్పగించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు బీసీసీఐ వర్గాలు ఇన్‌సైడ్‌స్పోర్ట్‌తో మాట్లాడుతూ… ‘‘టీమిండియా టెస్టు కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు తనకు వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ వచ్చింది.
కాబట్టి ఇప్పుడు తనే సారథిగా ఉండబోతున్నాడు. త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రకటన వెలువడుతుంది’’ అని పేర్కొన్నాయి. టీమిండియా సౌతాఫ్రికా పర్యటన ముగిసిన తర్వాత బీసీసీఐ అధికారికంగా రోహిత్ పేరును అనౌన్స్ చేస్తుందనే సంకేతాలు ఇచ్చాయి. అదే విధంగా వైస్ కెప్టెన్ విషయంలోనూ బీసీసీఐలో ఇప్పటికే చర్పోచర్చలు నడుస్తున్నట్లు సమాచారం.
ఈ విషయం గురించి బోర్డు అధికారి ఒకరు మాట్లాడుతూ… ‘‘వైస్ కెప్టెన్ భవిష్యత్తు కెప్టెన్ అవుతాడు కదా. కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, జస్‌ప్రీత్ బుమ్రా.. వీళ్లంతా భవిష్యత్తు నాయకులు. వీరిని సారథులుగా తీర్చిదిద్దే క్రమంలో సెలక్టర్లు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.
వైస్ కెప్టెన్ ఎవరన్న అంశంపై తీవ్ర కసరత్తు జరుగుతోంది’’ అని వ్యాఖ్యానించారు. కాగా కోహ్లి గైర్హాజరీలో అజింక్య రహానే కెప్టెన్‌గా.. ఛతేశ్వర్ పుజారా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సీనియర్లు వరుసగా విఫలం అవుతుండటంతో జట్టులో చోటు దక్కడమే కష్టంగా మారింది. ఇక దక్షిణాఫ్రికాతో రెండో టెస్టుకు సారథిగా వ్యవహరించిన కేఎల్ రాహుల్‌నే వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసేందుకు బీసీసీఐ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పంత్ కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.