భారీగా పెరుగుతున్న డెంగీ రోగులు

భారీగా పెరుగుతున్న డెంగీ రోగులు
తెలంగాణ రాష్ట్రాన్ని డెంగీ, విషజ్వరాలు వణికిస్తున్నాయి. వాతావరణ మార్పులు, దోమ కాటు వల్ల ఎక్కడ చూసినా ప్రజలు జ్వరాలు, తీవ్ర ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నారు. ఇంటిల్లిపాదికీ జ్వరాలు వస్తుండటంతో జనం సతమతం అవుతున్నారు. ఓవైపు హాస్పిటల్‌ల బిల్లుల మోత మరోవైపు ఇంటి పని చేసుకోలేక సతమతం అవుతున్నారు. డెంగీ జ్వరం లక్షణాలతో 24 రోజుల వ్యవధిలో మంచిర్యాలలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడటం అందర్నీ కలచివేసింది.
రాష్ట్ర ప్రభుత్వం డెంగీ కేసులు లేవని చెబుతున్నా ఈ లక్షణాలతో హాస్పిటల్‌లో చేరుతున్న వారి సంఖ్య మరణిస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. ఇటీవలే ఖమ్మంలో మహిళా జడ్జి సైతం డెంగీ లక్షణాలతో కన్నుమూశారు. దీంతో ఐఏఎస్‌లకు హైకోర్టు చివాట్లు పెట్టింది.

రాష్ట్రంలో విష జ్వరాల తీవ్రతకు అద్దం పట్టే ఘటన వికారాబాద్‌లో చోటు చేసుకుంది. పట్టణంలోని ఓ క్రైస్తవ మిషనరీ ఆసుపత్రిలో డెంగీ రోగుల సంఖ్య భారీగా పెరిగింది. హాస్పిటల్ సామర్థ్యానికి మించి పేషెంట్లు రావడంతో స్థలాభావం ఏర్పడింది. దీంతో ఆస్పత్రి యాజమాన్యం ఆరుబయట చెట్ల కింద గొడుగులను ఏర్పాటు చేసి రోగులకు చికిత్స అందిస్తోంది. ఒక్కో గొడు కింద ముగ్గురు, నలుగురు చొప్పున పేషెంట్లను కూర్చొబెట్టి  సెలెన్లను ఎక్కిస్తున్నారు. బయటి నుంచి చూసేవారికి అది హాస్పిటల్‌లా కాకుండా హోటల్‌లా కనిపిస్తోంది.