మీ పిల్లలు టీవీల్లో, సెల్ఫోన్లలో క్రైమ్ సీన్స్, క్రైమ్ ప్రోగ్రామ్స్ చూస్తున్నారా? అయితే జాగ్రత్త! అవి వారిపై ఎంత ప్రభావం చూపుతున్నాయంటే.. టీవీ ప్రోగ్రామ్స్‌లో చూసిన వాటిని ట్రై చేసేంతగా. చివరికి ఆ ఉత్సుకత ప్రాణాల మీదకు తెచ్చిపెడుతోంది. నిత్యం టీవీలో క్రైమ్ ప్రోగ్రామ్స్ చూసే ఓ బాలుడు వాటిని ట్రై చేయాలనుకుని ఉరి బిగించుకున్నాడు. ఎవరూ చూడకపోవడంతో చివరికి ప్రాణాలొదిలేసిన ఘటన తాజాగా వెలుగుచూసింది.
పశ్చిమ బెంగాల్‌లోని మల్దా జిల్లా దువాదిఘి గ్రామానికి చెందిన రజనీకాంత్ సాహా(10) నాలుగో తరగతి చదువుతున్నాడు. సడెన్‌గా ఓ రోజు గదిలో ఉరికి వేలాడుతూ కనిపించాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లడంతో చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. పదేళ్ల బాలుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.
చిన్నప్పటి నుంచి సాహాకు టీవీలో క్రైమ్ ప్రోగ్రామ్స్ చూడడమంటే పిచ్చి. నిత్యం అవే చూస్తూ ఉంటాడు. ఆ ప్రోగ్రాంలో వచ్చినట్లుగా అనుకరించబోయి ఇలా ఉరి వేసుకుని ఉంటాడని బాలుడి కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ సమయంలో ఎవరూ గమనించకపోవడంతో ప్రాణాలు పోయి ఉంటాయని చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.