Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పవన్ ఫ్యాన్స్ తనపై దాడి చేసారంటూ పోలీస్ స్టేషన్ గడప తొక్కిన కత్తి మహేష్… పవన్ ఫామ్ హౌస్ లోగుట్టు చెబుతానని హెచ్చరించిన కత్తి మహేష్ … ఈ పోరాటం ఇక్కడితో ఆగేది కాదని తొడ చరిచిన కత్తి మహేష్… ఒక్కసారిగా పవన్ ఫ్యాన్స్ తో రాజీ పడ్డారు. స్వీట్స్ పంచుకుని మరీ కత్తి మహేష్, పవన్ అభిమానులు ఫోటోలకు ఫోజులు ఇస్తుంటే వీళ్లేనా నిన్నమొన్నటిదాకా కొట్టుకుంది, తిట్టుకుంది అని చూసే వాళ్ళే ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి. పవన్ అంటేనే మండిపడ్డ కత్తి మహేష్ ఒక్కసారిగా ఇలా చల్లబడడానికి అసలు కారణం ఏంటి? కోడిగుడ్లతో దాడి చేసిన పవన్ ఫ్యాన్స్ చెప్పిన సారీ తోటే చల్లబడ్డారా ? లేక ఇంకేదైనా కారణం ఉందా?
కత్తి మహేష్ పవన్ ఫ్యాన్స్ తో రాజీ పడడం వెనుక పైకి కనిపించే కారణాలతో పాటు లోలోపల జరిగిన కసరత్తు చాలా వుంది. ఆ కసరత్తు జరిపింది జనసేన వ్యూహకర్తలే అని పక్కా సమాచారం. జనవరి 15 తర్వాత గొడవ చల్లబడుతుంది అనుకుంటే కత్తి మహేష్ మాటల్లో పదును పెరగడం, ఆయన మీద దాడి జరగడం, పవన్ వ్యక్తిగత విషయాలను ప్రస్తావించడం వంటి వాటితో పరిస్థితి ఇంకా సీరియస్ అయ్యింది. ఇది ఇలాగే కొనసాగితే రాజకీయంగా జనసేనకు భారీ నష్టం అని పవన్ సన్నిహితులు ఓ అంచనాకు వచ్చారట. అందుకే ఓ మెట్టు దిగి అయినా కత్తి తో రాజీ చేసుకోవాలని భావించారట. అదే సమయంలో అటు కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి పెరగడం, ఆయన వ్యక్తిగత విషయాలు కూడా బయటకు రావడం తో కత్తి కూడా గౌరవప్రదమైన పరిష్కారం దొరికితే ఈ వివాదం నుంచి బయటపడాలని ఎదురు చూస్తున్నారు. అభిప్రాయాల విషయంలో తేడా ఉన్నప్పటికీ గొడవ చల్లారాలని రెండు వర్గాలు భావించడంతో సమస్య ఓ కొలిక్కి వచ్చింది. అయితే పవన్ ఫ్యాన్స్ వెనక్కి తగ్గడానికి రాజకీయంగా జనసేన కు నష్టం అన్న పాయింట్ ముఖ్య కారణం అని తెలుస్తోంది. ప్రజారాజ్యం టైం లో రాజశేఖర్ దంపతుల మీద దాడి అంశం ఆ పార్టీకి ఎంత చేటు చేసిందో దగ్గరుండి గమనించిన పవన్ సన్నిహితులే ఈ రాజీ కోసం పవన్ ఫ్యాన్స్ తో మాట్లాడి ఒప్పించారట. మొత్తానికి రాజకీయం వల్లే కొన్ని నెలలుగా టీవీ స్క్రీన్ మీద తిష్ట వేసి తెలుగు లోగిళ్ళలో సాగిన నిత్య పోరాటం సమసిపోయింది.