మీరు కాఫీ ప్రియులా?

మీరు కాఫీ ప్రియులా?

నిజానికి.. కాఫీ తాగిన వెంటనే కెఫిన్ కారణంగా శరీరంలోని నాడీ వ్యవస్థ ఉత్తేజపూరితంగా మారుతుంది. అందుకే మనలో ఎక్కడా లేని హుషారు వస్తుంది. చురుకుదనం ఉరకలేస్తుంది. కొంత మందికి వేళకు కాఫీ పడకపోతే ఊరికే చిరాకు వస్తుంది. నీరసం, విసుగు వంటివి కనిపిస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే మైల్డ్ డ్రగ్ కేటగిరీలోకే కాఫీ వస్తుంది.

మీరు కాఫీ ప్రియులా? రెండు మూడు కప్పుల కాఫీ లేకపోతే మీకు రోజు గడవదా? ఇటువంటి వారికో శుభవార్త. రోజుకు రెండు మూడు కప్పుల కాఫీ తాగితే గుండె సంబంధ వ్యాధులు దరి చేరవట. ఈమేరకు అమెరాకాలోనో ఓ ప్రసిద్ధ హెల్త్ యూనివర్సిటీ పరిశోధనలో వెల్లడైంది. ఐతే.. కప్పులకు కప్పులు కాఫీ తాగేస్తే మాత్రం అనారోగ్యం పాలవడం ఖాయమని పరిశోధకులు చెబుతున్నారు. ఈ పరిశోధన ద్వారా వెల్లడైన పలు ఆసక్తికర విషయాలను పరిశీలిస్తే..

దాదాపు పదేళ్ల నుంచి కాఫీ తాగే అలవాటు ఉన్న మొత్తం 1000 మంది మధ్య వయస్కులపై ఈ పరిశోధన నిర్వహించారు. ఈ పరిశోధనకు సంబంధించి రెండు జర్నల్స్‌ను ప్రచురించారు. కాఫీ తాగని వారితో పోల్చితే రోజుకు రెండు లేదా మూడు కప్పుల కాఫీ తాగేవారిలో గుండె సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం 5 నుంచి 12 శాతం తక్కువని ఓ జర్నల్‌ నివేదిక చెబుతోంది. హార్ట్ డిసీజెస్ వచ్చే ప్రమాదం 30 శాతం తక్కువని మరో జర్నల్ నివేదిక ద్వారా బయటపడింది.

డీకెఫినేటెడ్ కాఫీ కంటే కెఫినేటెడ్ కాఫీ తాగడం బెస్ట్ అని మరో పరిశోధన ద్వారా వెల్లడైంది. కెఫినేటెడ్ కాఫీ పౌడర్‌లో కెఫిన్ శాతం ఎక్కువగా ఉంటుంది. అదే.. డీకెఫినేటెడ్ కాఫీలో కొద్దిగా కెఫీన్ ఉంటుంది. టేస్ట్ మాత్రం ఇంచుమించు ఒకేలా ఉంటుంది. కెఫినేటెడ్ కాఫీని కంట్రోల్ తప్పనంత తాగితే ఫర్వాలేదని ఈ పరిశోధన తేల్చింది.

ఐతే.. డీకెఫినేటెడ్ కాఫీ తాగిన వారిలో గుండె పని తీరు మందగిస్తుందని తమ అధ్యయనం ద్వారా బయటపడిందని పరిశోధకులు చెబుతున్నారు. కాఫీ తాగే వారికి ప్రొస్టేట్ కాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువ అని గతంలో మరో పరిశోధన తేల్చింది. బ్లాక్ కాఫీ కూడా మంచిదే. అలాగే.. ఇన్‌స్టెంట్ కాఫీ కంటే.. ఫిల్టర్ కాఫీ బెస్ట్ అట.

రోజుకు రెండూ లేదా మూడు లేదా నాలుగు… ఇలా ఇన్నిసార్లంటూ లెక్క పెట్టుకుని మరీ కాఫీ తాగేస్తుంటాం. కానీ.. కాఫీ కప్పులకూ ఓ లెక్కుందట. రోజుకు 400 మిల్లీ గ్రాముల కంటే ఎక్కువ కెఫిన్ తీసుకుంటే మన శరీరం అనారోగ్యం పాలవుతుందట. 400 మిల్లీ గ్రాముల కెఫిన్‌తో తయారైన కాఫీ అంటే సుమారు 4 కప్పులు. అంటే.. రోజుకు 4 కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగితే మేలు మాట అటుంచి.. హాని తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ప్రెగ్నెంట్ లేడీస్ లేదా బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్న విమెన్ మాత్రం రోజుకు 200 మిల్లీ గ్రాములకు మించిన కెఫిన్ తీసుకోకూడదట. అంటే.. రోజుకు 2 కప్పుల కంటే ఎక్కువ కాఫీ తీసుకోకూడదు. అది కూడా డాక్టర్లను సంప్రదించి.. వారు ఓకే అంటేనే తాగాలి. ప్రెగ్నెన్నీ పూర్తయ్యే వరకు కాఫీ తాగడం మానేస్తే ఇంకా మంచిదని కొంత మంది హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.

రోజుకు 4 కప్పులు కంటే ఎక్కువ కాఫీ తాగితే బోలెడన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. తీవ్రమైన తలనొప్పి, నిద్ర లేమి, కాన్సెన్ట్రేషన్ దెబ్బ తినడం, ఎక్కువ సార్లు మూత్రం రావడం, గుండె వేగంగా కొట్టుకోవడం, కండరాల నొప్పి తదితర దుష్పరిణామాలుంటాయని హెచ్చరిస్తున్నారు. అలాగే.. పునరుత్పత్తి వ్యవస్థపై కూడా కాఫీ తీవ్రంగా ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అతిగా కాఫీ తాగితే రక్తపోటు పెరుగుతుందని ఓ పరిశోధన తేల్చింది. అందుకే హై బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్లు కాఫీ జోలికి వెళ్లకపోవడం ఉత్తమం. జీర్ణ సంబంధ వ్యాధులు ఉన్నవారు కూడా కాఫీకి దూరంగానే ఉండాలి. నిద్ర లేమితో బాధపడేవారు కూడా కాఫీ తాగకూడదు. అలాగే.. పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ కాఫీ ఇవ్వకూడదు. కాఫీ తాగని పిల్లలతో పోల్చితే.. తాగే పిల్లల ఎదుగుదల సక్రమంగా ఉండదని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. అలాగే.. పరగడుపున కాఫీ తాగినా తీవ్రమైన దుష్ప్రభావాలుంటాయట.