చివరి వరకూ పోరాడిన బెంగాల్ వారియర్స్

చివరి వరకూ పోరాడిన బెంగాల్ వారియర్స్

ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్‌లో జైపూర్ వేదికగా ఆదివారం రాత్రి జైపూర్ పింక్ పాంథర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి వరకూ పోరాడిన బెంగాల్ వారియర్స్ 41-40 తేడాతో విజయాన్ని అందుకుంది. దీంతో.. జైపూర్ టీమ్‌కి సొంతగడ్డపై వరుసగా రెండో మ్యాచ్‌లోనూ నిరాశ తప్పలేదు. శనివారం రాత్రి గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌ని జైపూర్ టైగా ముగించిన విషయం తెలిసిందే.

బెంగాల్ వారియర్స్‌ని ఇటీవల వరుస మ్యాచ్‌ల్లో గెలిపిస్తున్న స్టార్ రైడర్ మణీందర్.. జైపూర్‌పైనా సత్తాచాటాడు. మ్యాచ్‌లో 24 సార్లు రైడ్‌కి వెళ్లిన మణీందర్.. ఏకంగా 19 పాయింట్లు సాధించాడు. అతనికి డిఫెండర్ బలదేవ్ నుంచి సపోర్ట్ లభించడంతో ఆఖరి వరకూ మ్యాచ్‌లో బెంగాల్ పోరాడగలిగింది .

మరోవైపు జైపూర్ జట్టులోనూ సీనియర్ రైడర్ నీలేశ్ సాలుంకే జట్టుని గెలిపించేందుకు ప్రయత్నించాడు. కానీ.. ఆఖర్లో చేసిన చిన్న తప్పిదం ఆ జట్టుకి విజయాన్ని చేజార్చింది. ఆదివారం జరిగిన మరో మ్యాచ్‌లో గుజరాత్ పార్చూన్ జెయింట్స్‌పై 31-25 తేడాతో యు ముంబా విజయాన్ని అందుకుంది.