అద్భుత ప్రదర్శనతో వెస్టిండీస్‌పై రెండో టెస్టులో ఇంగ్లండ్‌ను గెలిపించిన బెన్ స్టోక్స్ ఐసీసీ టెస్టు ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. సోమవారం ప్రకటించిన తాజా ర్యాంకుల్లో అతను నంబర్‌వన్‌గా (497 పాయింట్లతో) నిలిచాడు. ఫలితంగా ఆండ్రూ ఫ్లింటాఫ్ (2006) తర్వాత ఈ ఘనత సాధించిన తొలి ఇంగ్లండ్ ఆటగాడిగా నిలిచాడు.
గత 18 నెలలుగా అగ్రస్థానంలో ఉన్న విండీస్ కెప్టెన్ హోల్డర్ (459)ను స్టోక్స్ వెనక్కి తోశాడు. రెండో టెస్టులో 176, 78 పరుగులు చేయడంతో పాటు 3 వికెట్లు తీసిన ప్రదర్శన అతడిని నంబర్‌వన్‌ను చేసింది. బ్యాట్స్‌మన్ ర్యాంకింగ్స్‌లో కూడా స్టోక్స్ కెరీర్ బెస్ట్ మూడో ర్యాంక్‌కు చేరుకున్నాడు. మరోవైపు తాజా విజయంతో 40 పాయింట్లు సాధించిన ఇంగ్లండ్ ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌లో మొత్తం 186 పాయింట్లతో మూడో స్థానానికి చేరింది.