ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు ట్రైలర్ తో సినీ అభిమానుల దృష్టిని ఆకర్షించిన చిత్రం ‘భైరవ గీత’. ఈ సినిమాకి 25 ఏళ్ళ యువదర్శకుడు సిద్ధార్థ తథోలు దర్శకత్వం వహిస్తుండగా, తెలుగు మరియు కన్నడ భాషల్లో ఈ నెల 30 న విడుదలవ్వబోతుంది. ఈ సినిమాలో కన్నడ నటుడు ధనంజయ హీరోగా భైరవ పాత్రలో నటిస్తుండగా, ఇర్రా మోరే హీరోయిన్ గా గీత పాత్రలో నటిస్తుంది. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంగా తెరకెక్కిన ఈ సినిమా కథ ఒక చిన్న వర్గపు యువకుడికి, పెద్ద వర్గపు యువతికి మధ్య జరిగిన నిజజీవితపు ప్రేమ కథ అయినప్పటికీ, సమాజంలో అణగారిన వర్గం తమని అణగదొక్కుతున్న అధికార వర్గం పైన జరిపే తిరుగుబాటు ఇతివృత్తంగా సినిమా కథాంశం ఉండబోతుంది.
తగరు అనే కన్నడ సినిమాలో విలన్ గా నటించి, అందరి మన్ననలు అందుకున్న కన్నడ నటుడు ధనంజయ నటనకి ఫిదా అయిన రామ్ గోపాల్ వర్మ ధనంజయ ని హీరోగా తెలుగు భాషలో కూడా పరిచయం చేయడానికి భైరవ గీత కథ రాసి, తన అసిస్టెంట్ డైరెక్టర్ సిద్ధార్థ తథోలు దర్శకత్వంలో నిర్మించి తెలుగు మరియు కన్నడ భాషల్లో విడుదలచేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా రిలీజ్ ట్రైలర్ ఈరోజున విడుదల అయ్యింది. మొదటి ట్రైలర్ లో శృంగారాన్ని హెచ్చుస్థాయిలో చూపెట్టినా, ఈ రిలీజ్ ట్రైలర్లో మాత్రం కనీసం ఒక ముద్దు సన్నివేశాన్ని కూడా చూపెట్టకపోవడం విశేషం. ఈ ట్రైలర్ లోని ప్రతి సన్నివేశం రోమాలు నిక్కబొడుచుకునేలా ఉందనడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఈ రిలీజ్ ట్రైలర్ ని తన ట్విట్టర్ పేజీలో విడుదల చేసిన రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాని శంకర్ దర్శకత్వం వహించిన రోబో 2.0 తో సరిపోల్చుతూ “రోబో 2.0 ఒక చాలా పెద్ద డైరెక్టర్ చిన్న పిల్లల కోసం తీసిన సినిమా…భైరవ గీత ఒక చిన్న పిల్లోడు పెద్దవాళ్ళ కోసం తీసిన సినిమా” అని చెప్పుకొచ్చాడు.