Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అంతర్జాతీయ న్యాయస్థానం ఎన్నికల్లో భారత్ న్యాయమూర్తి దల్వీర్ భండారీ మరోసారి ఎన్నికయ్యారు. చివరి నిమిషంలో బ్రిటన్ తన అభ్యర్థిని ఉపసంహరించుకోవడంతో భండారీ ఎన్నికకు మార్గం సుగమమైంది. నెదర్లాండ్స్ లోని ది హేగ్ లో గల అంతర్జాతీయ న్యాయస్థానంలో 15 మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఉంటుంది. వీరి పదవీ కాలం తొమ్మిదేళ్లు. మూడేళ్లకోసారి ఐదుగురి స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఐక్యరాజ్యసమితిలోని జనరల్ అసెంబ్లీలో కల 193 మంది, భద్రతామండలిలోని 15 మంది ఈ ఎన్నికల్లో ఓటు వేస్తారు. న్యాయమూర్తిగా ఎన్నిక కావాలంటే జనరల్ అసెంబ్లీలో కనీసం 97 ఓట్లు, భద్రతామండలిలో 8 ఓట్ల మెజార్టీ సాధించాలి. 2012 ఏప్రిల్ 27న ఐసీజేకు ఎన్నికయిన భండారీ పదవీకాలం 2018 ఫిబ్రవరి 5తో ముగియనుంది.
బ్రిటన్ కు చెందిన జస్టిస్ క్రిస్టోఫర్ గ్రీన్ వుడ్, ఫ్రాన్స్, సోమాలియా, బ్రెజిల్ న్యాయమూర్తుల పదవీకాలం కూడా ముగియనుండడంతో ఈ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. వారితో పాటు లెబనాన్ న్యాయమూర్తి కూడా పోటీలోకి వచ్చారు. ఎన్నికల్లో ఫ్రాన్స్, బ్రెజిల్, సోమాలియా, లెబనాన్ న్యాయమూర్తులు మెజార్టీతో గెలుపొందగా, మిగిలిన ఒక్కస్థానం కోసం భండారీ, గ్రీన్ వుడ్ మధ్య హోరాహోరీ నెలకొంది. 11 రౌండ్లు పూర్తయినా ఫలితం తేలకపోవడంతో మరో రౌండ్ నిర్వహించాలని భావించారు. అయితే ఎన్నికకు కొన్ని గంటల ముందు బ్రిటన్ అనూహ్యంగా తన అభ్యర్థిని పోటీ నుంచి తప్పించింది. తన నామినేషన్ ఉపసంహరించుకుంటున్నట్టు జస్టిస్ గ్రీన్ వుడ్ తెలిపారు. దీంతో భండారీ రెండోసారి న్యాయమూర్తిగా ఎన్నికయ్యారు. భండారీ ఎన్నికపై రాష్ట్రపతి,ప్రధానమంత్రి సహా పలువురు ప్రముఖులు సంతోషం వ్యక్తంచేశారు. భండారీ ఎన్నిక దౌత్యపరంగా మైలురాయి అని రామ్ నాథ్ కోవింద్ వ్యాఖ్యానించగా…దేశానికి గర్వకారణమని మోడీ అభివర్ణించారు.