కాంగ్రెస్ యువ నేత భవ్య బిష్ణోయ్‌తో మార్చి నెలలో ఎంగేజ్మెంట్ చేసుకున్న మెహ్రీన్.. ఉన్నట్టుండి సడెన్‌గా తన బ్రేకప్ విషయం బయటపెట్టడంతో అంతా షాకయ్యారు. మరికొద్ది రోజుల్లో పెళ్లి జరుగుతుందని అంతా అనుకుంటున్న తరుణంలో అందరికీ షాకిస్తూ పెళ్లి క్యాన్సిల్ అని చెప్పింది మెహ్రీన్. దీంతో ఆమె తీసుకున్న ఈ నిర్ణయం వెనుక కారణాలేంటనే దానిపై పెద్దఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అలాంటి వార్తలను ఖండిస్తూ భవ్య బిష్ణోయ్ రియాక్ట్ కావడంతో మరోసారి వీళ్లిద్దరి ఇష్యూ జనాల్లో హాట్ టాపిక్ అయింది.
మెహ్రీన్ ఎంగేజ్మెంట్ సమయంలో బిష్ణోయ్ ఫ్యామిలీ ఆమె కెరీర్ గురించి ఎలాంటి కండీషన్స్ పెట్టలేదట. కానీ, ఆ తర్వాత ఆమె సినిమాల్లో నటించొద్దని చెప్పిన కారణంగానే ఇన్ని రోజులు మెహ్రీన్ తన పెళ్లి వాయిదా వేస్తూ వచ్చిందని, చాలా రోజులుగా వాళ్లను ఒప్పించే ప్రయత్నం చేసినా ఆ కుటుంబం అస్సలు కుదరదని చెప్పడంతో మెహ్రీన్ ఈ నిర్ణయం తీసుకుందనే వార్తలు జోరుగా షికారు చేశాయి. దీంతో ఈ విషయమై భవ్య రియాక్ట్ అయ్యారు.
తనకు మెహ్రీన్‌కి మధ్య వచ్చిన అభిప్రాయ భేదాల కారణంగా పరస్పర అంగీకారంతో నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నామని భవ్య బిష్ణోయ్ అన్నారు. జులై 1వ తదీనే తామిద్దరం ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. మెహ్రీన్ పరిచయమైన నాటి నుంచి ఆమెను ఎంతో ప్రేమించానని, తామిద్దరిది మంచి జోడీ అవుతుందని భావించానని అన్నారు. మెహ్రీన్ నుంచి విడిపోతున్నందుకు బాధ పడడం లేదని చెప్పారు.
పెళ్లి క్యాన్సిల్ విషయంలో తన కుటుంబాన్ని నిందిస్తే ఊరుకునేది లేదని భవ్య బిష్ణోయ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తన కుటుంబానికి సమాజంలో మంచి గౌరవం ఉందని, ఎవరైనా నెగెటివ్ కామెంట్స్ చేస్తే తగిన చర్యలు తీసుకుంటానని ఆయన పేర్కొన్నారు. మెహ్రీన్ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని, ఆమె కలలన్నీ సాకారం కావాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలపడం విశేషం.