హీరోయిన్లకు మంచి కౌంటర్ ఇచ్చిన బ్రహ్మాజీ

హీరోయిన్లకు మంచి కౌంటర్ ఇచ్చిన బ్రహ్మాజీ

కరోనా విజృంభణ నేపథ్యంలో దాన్ని అరికట్టడానికి సామాజిక దూరం ఒక్కటే సరైన పరిష్కారం అని భావించిన ప్రభుత్వం.. దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో అన్ని పరిశ్రమలు, వ్యాపార సంస్థలు మూతపడటంతో దినసరి కూలీల పరిస్థితి దారుణంగా తయారైంది. చేతిలో చిల్లిగవ్వ లేక అష్టకష్టాలు పడుతున్నారు.

ఈ పరిస్థితి చూసి ప్రభుత్వం పెద్దఎత్తున సహాయక చర్యలు చేపట్టింది. ప్రభుత్వంలో పాటు పలువురు వ్యక్తులు, స్వచ్చంద సంస్థలు సైతం ముందుకొచ్చి ప్రభత్వానికి తమ వంతు సహకారం అందిస్తున్నారు. సీఎం, పీఎం సహాయనిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు టాలీవుడ్ సినీ హీరోలు సైతం పెద్ద ఎత్తున ఆర్థిక సాయం ప్రకటించారు.

ఇకపోతే కరోనా ప్రభావిత సినీ కార్మికుల సంక్షేమం కోసం చిరంజీవి సారథ్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ) ఓపెన్ చేసి పేదలకు నిత్యావసర వస్తువులు అందిస్తూ అండగా ఉంటోంది టాలీవుడ్. ఈ ‘సీసీసీ’కి సైతం బ్రహ్మాజీ సహా పలువురు హీరోలు, దర్శకనిర్మాతలు ఆర్థిక తోడ్బాటు అందించారు.

తెలుగు సినీ కార్మికుల‌ను ఆదుకోవ‌డానికి ఏర్పాటు చేసిన ఈ ‘కరోనా క్రైసిస్ ఛారిటీ’కి హీరోయిన్స్ నుండి మాత్రం పెద్దగా మ‌ద్ద‌తు లభించడం లేదు. లావ‌ణ్య త్రిపాఠి, ప్రణీత లాంటివారు తప్పితే మిగితా హీరోయిన్స్ నుంచి స్పందన కరువైంది. ఈ నేపథ్యంలో హీరోయిన్లను ఉద్దేశిస్తూ బ్రహ్మాజీ కొన్ని కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది.

ముంబైకి చెందిన చాలా మంది హీరోయిన్స్ ఇక్క‌డ ప‌నిచేస్తున్నారని, అంద‌రూ స్టార్ హీరోయిన్స్‌గా రాణిస్తున్నా.. వారెవ‌రూ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన చారిటీ కోసం స్పందించ‌క పోవ‌డం ఆశ్చ‌ర్యంగా ఉందని బ్రహ్మాజీ అన్నాడు. దీంతో బ్ర‌హ్మాజీ అన్న మాట‌ల్లోనూ నిజం లేక‌పోలేదనే టాక్ ముదిరింది.