ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్న సంగతి తెలిసిందే. తన భార్య భువనేశ్వరిపై అభ్యంతర వ్యాఖ్యలు చేశారని ఆయన ప్రెస్మీట్లోనే వెక్కి, వెక్కి ఏడ్చారు. అసెంబ్లీ ఘటనను ఎన్టీఆర్ కుటుంబం మొత్తం ఖండించింది. కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి సైతం వైఎస్సార్సీపీ నేతలపై ఫైర్ అయ్యారు. తాజాగా అసెంబ్లీ ఘటన అసెంబ్లీ తరువాత నారా భువనేశ్వరి తొలిసారి స్పందించారు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తనపై చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం చేసిన వారందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు భువనేశ్వరి తెలిపారు. ‘నాకు జరిగిన అవమానాన్ని మీ తల్లికి, తోబుట్టువుకు, కూతురికి జరిగినట్టుగా భావించి నాకు అండగా నిలబడటం నా జీవితంలో మర్చిపోలేను. చిన్నతనం నుంచి అమ్మ గారు, నాన్న గారు మమ్మల్ని విలువలతో పెంచారు. నేటికీ మేము వాటిని పాటిస్తున్నాము..’ అని భువనేశ్వరి ప్రెస్ నోట్ విడుదల చేశారు.
విలువలతో కూడిన సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని భువనేశ్వరి అన్నారు. కష్టాల్లో.. ఆపదలో ఉన్న వారికి అండగా నిలబడాలన్నారు. ఇతరుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా, గౌరవానికి భంగం కలిగించేలా ఎవరూ వ్యవహరించకూడదని చెప్పారు. తనకు జరిగిన ఈ అవమానం మరెవరికీ జరగకుండా ఉండాలని ఆశిస్తున్నానని ఆమె లేఖలో పేర్కొన్నారు.