అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వచ్చే నెలలో తలపెట్టిన భారత పర్యటన రద్దైంది. జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరుకాబోవడం లేదు. ఈ విషయాన్ని అమెరికా తెలియజేసిందని సంబంధిత వర్గాలు మంగళవారం వెల్లడించాయి. ‘జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి తొలి వారంలో అమెరికా కాంగ్రెస్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి బైడెన్ వార్షిక ప్రసంగం చేయాల్సి ఉంది. రెండోదఫా మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం పైనా ఆయన దృష్టి పెడుతున్నారు.
అలాగే హమాస్-ఇజ్రాయెల్ వివాదంలో వాషింగ్టన్ కీలక పాత్ర పోషించే దిశగా సాగుతోంది’ ఈ కారణాల నేపథ్యంలో బైడెన్ పర్యటన రద్దైనట్లుగా భావిస్తున్నారు. గణతంత్ర వేడుకలకు బెడెన్ను భారత ప్రధాని మోదీ ఆహ్వానించారంటూ గత సెప్టెంబరులో భారత్లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి తెలిపారు. బైడెన్ పర్యటన రద్దు నేపథ్యంలో జనవరి 27న భారత్లో నిర్వహించాలని భావించిన క్వాడ్ సదస్సును 2024 చివరిలో నిర్వహించాలని యోచిస్తున్నారు.