గూగుల్‌కు రష్యాలో మరోసారి షాక్‌

గూగుల్‌కు రష్యాలో మరోసారి షాక్‌

రష్యాలో విదేశీ టెక్‌ దిగ్గజాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ప్రముఖ దిగ్గజ టెక్‌ సంస్థ గూగుల్‌కు రష్యాలో మరోసారి షాక్‌ తగిలింది. నిషేధిత కంటెంట్‌ను తొలగించడంలో విఫలమైనందుకు మాస్కో కోర్టు గురువారం (ఆగస్టు 19)న గూగుల్‌కు మరో జరిమానా విధించింది. ఇటీవలి కాలంలో రష్యా విదేశీ టెక్ కంపెనీలపై నిషేధించిన కంటెంట్‌ను తొలగించనందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంది.రష్యాలో నిషేధిత కంటెంట్‌లో భాగంగా అశ్లీల అంశాలు, తీవ్రవాది భావజాల పోస్ట్‌లు, డ్రగ్స్‌కు సంబంధించిన కంటెంట్‌ నిషేధిత జాబితాలో ఉన్నాయి.

నిషేధిత కంటెంట్‌ను ప్రదర్శించినందుకు గాను గూగుల్‌పై స్థానిక కోర్టు ఆరు మిలియన్‌ రూబీళ్లను (సుమారు రూ. 60 లక్షలు) జరిమానా విధించింది. కాగా ఈ వారం ప్రారంభంలో ఇదే విషయంపై వేరువేరు కేసుల్లో మొత్తంగా రూ. 14 మిలియన్ రూబిళ్ల (సుమారు రూ. 1.4 కోట్లు) జరిమానాలు విధించబడ్డాయి. గతనెల డేటానిల్వ చట్టాలను ఉల్లంఘించినందుకు గత నెల గూగుల్‌ సుమారు 3 మిలియన్‌ రూబిళ్లు (సుమారు రూ. 30 లక్షలు) జరిమానా కట్టింది.ఆర్‌ఐఏ నోవోస్టి న్యూస్ ఏజెన్సీ ప్రకారం.. రష్యా గూగుల్‌కు ఇప్పటివరకు 32.5 మిలియన్ రూబిళ్లు (సుమారు రూ. 3.2 కోట్లు) జరిమానాను విధించింది.

రష్యన్ వినియోగదారుల వ్యక్తిగత డేటాను రష్యాలోని సర్వర్‌లలో నిల్వ చేయాల్సిన వివాదాస్పద చట్టం కింద కంపెనీకి జరిమానా విధించడం ఇదే మొదటిసారి. ఇటీవల విదేశీ టెక్ కంపెనీలపై, ప్రత్యేకించి సోషల్ నెట్‌వర్క్‌లపై రష్యా ఒత్తిడి పెంచింది. ఈ ఏడాది ప్రారంభంలో క్రెమ్లిన్ క్రిటిక్‌ అలెక్సీ నవాల్నీను అరెస్ట్‌ చేసిన నేపథ్యంలో అరెస్టుగా వ్యతిరేకంగా చేయాదల్చినా నిరసన కార్యక్రమంలో పాల్గొనవల్సిందిగా ఇచ్చిన పోస్ట్‌ను తొలగించడంలో గూగుల్‌ విఫలమవ్వడంతో రష్యా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇటీవలి కాలంలో తీవ్రవాదంపై పోరాటం, ఇతర విషయాలపై రష్యా ప్రభుత్వం ఇంటర్నెట్‌పై నియంత్రణను కఠినతరం చేస్తోంది.