నాని హోస్ట్‌గా వ్యవహరిస్తున్న తెలుగు బిగ్‌బాస్ సీజన్ 2 విజయవంతంగా ముందుకు సాగుతుంది. మొదట్లో కాస్త మెల్లగా జరిగినా కూడా ఆ తర్వాత తర్వాత మాత్రం జోరు అందుకుంది. ఇప్పటికే ఎలిమినేషన్స్ ద్వారా ఆరుగురు ఇంటి సభ్యులు బయటకు వెళ్లి పోయారు. ఇక మొదటి సీజన్ మాదిరిగానే రెండవ సీజన్లో కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఇద్దరిని పంపించాలని బిగ్‌బాస్ నిర్వాహకులు భావిస్తున్నారు. రెండవ వారంలోనే నందిని రాయ్‌ను బిగ్‌బాస్ ఇంట్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా పంపించారు. ఇప్పుడు రెండవ వైల్డ్ కార్డ్ ఎంట్రీకి సన్నాహకాలు మొదలు అయ్యాయి. ఈసారి విభిన్నంగా ఇప్పటికే ఎలిమినేట్ అయిన ఇంటి సభ్యుల్లో ఒక్కరిని ఇంట్లోకి పంపించాలని నిర్ణయించారు.
మొదటి వారం నుండి నిన్నటి వరకు చూసుకుంటే సంజన, నూతన్ నాయుడు, కిరీటి, శ్యామల, భానుశ్రీ, తేజస్విలు ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు ఈ ఆరుగురిలో ఒకరిని బిగ్‌బాస్ ఇంట్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా పంపించబోతున్నారు. ఈ ఆరుగురిలో ఒకరిని ఎంపిక చేసే బాధ్యత షో నిర్వాహకులు ప్రేక్షకుల చేతిలో పెట్టారు. నామినేషన్స్‌లో ఉన్న ఇంటి సభ్యులకు ఓట్లు వేసి వారు ఎలిమినేషన్ కాకుండా ప్రేక్షకులు కాపాడుతూ ఉంటారు. అయితే ఈసారి మాత్రం బయటకు వచ్చేసిన వారికి ఓట్లు వేయడం ద్వారా మళ్లీ లోనికి పంపించే కార్యక్రమం పెట్టారు. బిగ్‌బాస్ ఇంట్లోకి పై ఆరుగురిలో ఎవరు వెళ్తారా అంటూ అప్పుడే ఆసక్తికర చర్చ జరుగుతుంది. వీరిలో ఎక్కువగా తేజూ మరియు భానుశ్రీలకు ఛాన్స్ ఉందనిపిస్తుంది. శ్యామలకు కూడా లోనికి వెళ్లే అవకాశం ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.