హిందీ ప్రేక్షకులను దాదాపు పది సంవత్సరాలుగా ఆకట్టుకుంటున్న బిగ్‌బాస్ తాజాగా తెలుగులో కూడా మొదలైంది. మొదటి సీజన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. మొదటి సీజన్ విజేతగా శివబాలాజీ నిలిచాడు. షో జరిగిన 70 రోజులు కూడా స్టార్ మాటీవీకి భారీ టీఆర్పీ రేటింగ్ దక్కింది. ముఖ్యంగా శనివారం మరియు ఆదివారాల్లో బిగ్‌బాస్ షో రికార్డు స్థాయిలో టీఆర్పీ రేటింగ్‌ను దక్కించుకుంది. స్టార్ మాటీవీకి ఏ ఇతర తెలుగు ఛానెల్‌కు రాని లాభాలు వచ్చాయి. మొదటి సీజన్ సూపర్ హిట్ అయిన నేపథ్యంలో రెండవ సీజన్‌ను అదే ఉత్సాహంతో భారీగా నిర్వహించాలని భావిస్తున్నారు. రెండవ సీజన్‌కు ఇప్పటి నుండే కసరత్తు మొదలు పెడుతున్నారు. ఈసారి స్టార్స్‌ను బిగ్‌బాస్ ఇంట్లోకి పంపించాలని భావిస్తున్నారు. అందుకు సంబంధించిన చర్చలను స్టార్ మాటీవీ వారు మొదలు పెట్టారట.
సినిమాల్లో నటిస్తున్న స్టార్స్ ముండే డేట్లు ఇచ్చి ఉంటారు, కనుక వారికి ఆరు నెలల ముందుగానే తెలియజేసి వారి డేట్లను తీసుకునేందుకు మాటీవీ వర్గాల వారు ప్రయత్నాలు చేస్తున్నారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మార్చిలో పరీక్షల సీజన్ అవ్వగానే ఏప్రెల్ రెండవ లేదా మూడవ వారంలో బిగ్‌బాస్ సీజన్ 2ను ప్రారంభించేందుకు సన్నాహాలు అప్పుడే మొదలు పెట్టాం అంటూ మాటీవీ సిబ్బంది ఒకరు చెప్పుకొచ్చారు. ఈసారి సెలబ్రెటీల స్థాయి మరింత ఎక్కువ ఉండాలని నిర్వాహకులు భావిస్తున్నారు. మొదటి సీజన్లో ఎక్కువ శాతం పార్టిసిపెంట్స్ పెద్దగా గుర్తింపు లేని వారు, పెద్దగా అవకాశాలు రాని వారు ఉన్నారు.
మొదటి సీజన్లో పాల్గొన్న సగానికి పైగా పార్టిసిపెంట్స్ సాదారణ ప్రేక్షకులకు తెలియదు. అయినా కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అదే అందరు కూడా సెలబ్రెటీలు అయితే షో రేంజ్ ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఖచ్చితంగా మొదటి సీజన్ కంటే డబుల్ సక్సెస్ అవుతుంది. అందుకే బిగ్‌బాస్ సీజన్ 2ను భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. బిగ్‌బాస్ మొదటి సీజన్లో పాల్గొన్న వారికి వారంకు 1.5 లక్షల నుండి 4 లక్షల వరకు మాత్రమే ఇచ్చారు. రెండవ సీజన్లో పార్టిసిపెంట్స్‌కు ఏకంగా 4 నుండి 8 లక్షల వరకు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ రేంజ్ పారితోషికాన్ని ఖచ్చితంగా మంచి స్టార్స్ లభిస్తారని స్టార్ మా వారు ఆశిస్తున్నారు.