మహాత్మాగాంధీ 152 వ జయంతి సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఖద్దర్ జాతీయ పతాకాన్ని లడఖ్‌లోని లెహ్ టౌన్లో ఆవిష్కరించారు. కాగా లడఖ్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ఆర్కే బథుర్ శనివారం ఉదయం ఈ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి ఆర్మీ ఛీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవనె కూడా హాజరయ్యారు.
225 అడుగుల పొడవు, 150 అడుగుల వెడల్పు కొలతతో ఖద్దర్ జాతీయ పతాకాన్ని రూపొందించారు. దాదాపుగా వెయ్యి కిలోల బరువున్న ఈ త్రివర్ణ పతాకాన్ని ఇండియన్ ఆర్మీకి చెందిన 57 మంది ఇంజనీర్ సైనిక దళం తయారుచేసింది.కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు.
కొండపై ప్రదర్శనకు ఉంచిన జెండా, కొండ మీదుగా వెళ్తున్న హెలికాప్టర్లు ఈ వీడియోలో కనిపిస్తాయి. ‘గాంధీజయంతి సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఖాదీ జాతీయ పతాకాన్ని లడఖ్‌లో ఆవిష్కరించడం దేశానికే గర్వకారణం. బాపు జ్ఞాపకార్థానికి, హస్తకళలను ప్రోత్సహించడానికి, దేశ గౌరవానికి ఇదే నా వందనం. జై హింద్. జై భారత్!’ అని ట్విటర్ పోస్టులో పంచుకున్నారు.