‘అల వైకుంఠపురములో’ సినిమాతో కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌

‘అల వైకుంఠపురములో’ సినిమాతో కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌

‘అల వైకుంఠపురములో’ సినిమాతో కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు అల్లు అర్జున్. ఈ సినిమా ఇప్పటికే బన్నీ హైయెస్ట్ గ్రాసర్ ‘సరైనోడు’ను అలవోకగా దాటేసింది. రూ.100 కోట్ల షేర్ మార్కును కూడా అందుకుంది. ఆ చిత్రం ఎక్కడిదాకా వెళ్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఐతే బన్నీ మాత్రం ముందే ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అని తేల్చేశాడు.

అతడి ఉద్దేశం నాన్-బాహుబలి హిట్ అనే కావచ్చు. అది సాధించాలంటే ‘రంగస్థలం’ పేరిట ఉన్న రూ.128 కోట్ల షేర్ మార్కు రికార్డును ‘అల..’ దాటాలి. ఐతే రెండో వీకెండ్ అయ్యేసరికి రూ.110 కోట్ల మార్కును దాటేలా కనిపిస్తున్న ఈ చిత్రం ఫుల్ రన్లో రూ.130 కోట్ల షేర్ వరకు వెళ్తుందా అన్నది చూడాలి. ఐతే బన్నీ మాత్రం ఈ విషయంలో చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నట్లున్నాడు. ‘అల..’ సక్సెస్ మీట్లో మాట్లాడుతూ.. ఈ సినిమాతో తనకు ఇండస్ట్రీ హిట్ దక్కడం చాలా ఆనందంగా ఉందని.. అది కూడా తన తండ్రి నిర్మించిన సినిమాతో ఈ ఫీట్ సాధించడం తనకు ఎక్కువ సంతృప్తినిస్తోందని.. ఆ రకంగా ఈ సినిమా కెరీర్లో తనకు స్వీట్ మెమొరీ అని బన్నీ అన్నాడు.

ఐతే ఓవైపు ఇలా రికార్డుల గురించి మాట్లాడుతూనే.. చివర్లో మాత్రం భిన్నమైన మాటలు మాట్లాడాడు బన్నీ. రికార్డులనేవి నమోదవుతుంటాయి.. తర్వాత బద్దలవుతుంటాయని.. కానీ ఒక మంచి సినిమా చూశాక కలిగే అనుభూతి వేరని చెప్పిన బన్నీ.. ‘రికార్డ్స్ ఆర్ వెరీ టెంపరరీ.. ఫీలింగ్స్ ఆర్ పర్మనెంట్’ అనే స్టేట్మెంట్‌తో తన ప్రసంగాన్ని ముగించాడు.