వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్

వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్

నవ్యాంధ్రప్రదేశ్ కు మూడు రాజధానుల వ్యవహారంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. సోమవారం ఉదయం భేటీ అయిన కేబినెట్… ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ వేర్వేరుగా ఇచ్చిన నివేదికలపై అధ్యయనం కోసం ఏర్పాటైన హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదికకు కాసేపటి క్రితం కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాకుండా సీఆర్డీఏను రద్దు చేయడంతో పాటు అధికార వికేంద్రీకరణకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరికాసేట్లో భేటీ కానున్న శాసనసభలోనూ ప్రభుత్వం ఈ ప్రతిపాదనను పెట్టనుంది. అసెంబ్లీలో వైసీపీకి ఫుల్ మెజారిటీ ఉన్న నేపథ్యంలో మూడు రాజధానులకు అనుకూలంగా ప్రతిపాదించనున్న ఈ తీర్మానానికి ఆమోదం లాంఛనమేనన్న వాదన వినిపిస్తోంది.

సోమవారం ఉదయం భేటీ అయిన కేబినెట్ భేటీ ముందుకు హైపవర్ కమిటీ నివేదిక వచ్చింది. ఈ నివేదికలో అమరావతిలో లెజిస్లెటివ్ కేపిటల్ ను కొనసాగించాలని, ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ను విశాఖపట్నానికి తరలించాలని, అదే సమయంలో జ్యుడిషియల్ కేపిటల్ ను కర్నూలుకు తరలించాలని హై పవర్ కమిటీ తేల్చేసింది. అయితే ముందు అనుకున్నట్లుగా ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా మారనున్న విశాఖలో వింటర్ అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను వెనక్కు తీసుకుంది. ఎన్ని సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగినా… వాటన్నింటినీ అమరావతిలోనే కొనసాగించాలని కూడా కమిటీ నివేదించింది. వెరసి విశాఖలో శాసనసభ ఏర్పాటును పక్కన పెట్టేసినట్టేనని చెప్పక తప్పదు.

ఇదిలా ఉంటే.. రాజధానిని అమరావతి నుంచి తరలించే యోచనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రాజధాని రైతులకు మరింత మెరుగైన పరిహారం ఇవ్వాలని కూడా హైపవర్ కమిటీ ప్రతిపాదించింది. ఇందులో భాగంగా రైతులకు మెరుగైన ప్యాకేజీ ఇవ్వాలని, రాజధాని రైతులకు ప్రస్తుతం ఇస్తున్న కౌలును 10 ఏళ్ల వరకు కాకుండా 15 ఏళ్ల పాటు కొనసాగించాలని కూడా కమిటీ సిఫారసు చేసింది. రైతులకు మరింత మెరుగైన ప్యాకేజీ అన్న విషయాన్ని కమిటీ ప్రతిపాదించనున్న నేపథ్యంలో రాజధాని రైతులు ఎలా స్పందిస్తారన్న విషయంపై ఆసక్తి నెలకొంది. అయితే రైతులకు న్యాయం చేసేలా నిర్ణయం తీసుకున్నామన్న భావనలో ఉన్న జగన్ సర్కారు… మూడు రాజధానులపై తనదైన శైలి సంచలన నిర్ణయం తీసుకుంది.