అసెంబ్లీ సాక్షిగా జనాభా నియంత్రణ విషయంలో మహిళల విద్యకు ఉన్న ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. ఆయన అసభ్యకరంగా మాట్లాడారంటూ బీజేపీ మండిపడింది. సీఎం స్థానంలో ఉండి మహిళలను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని వ్యాఖ్యానించింది. ఆయన కామెంట్స్ తమను ఎంతో బాధించాయని బీజేపీ మహిళా నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పదవికి నితీశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
బిహార్‌లో ఇటీవలే విడుదల చేసిన సమగ్ర కులగణన నివేదికపై అసెంబ్లీలో మాట్లాడుతూ.. భర్తల చేష్టల కారణంగా మరిన్ని జననాలు సంభవిస్తున్నాయని.. అయితే చదువుకున్న స్త్రీలు వాటిని కట్టడి చేస్తున్నారని నితీశ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడిన తీరు.. సంజ్ఞలు చూపించిన తీరు అసభ్యకరంగా ఉందంటూ బీజేపీ తీవ్రంగా ఫైర్ అయింది. నితీశ్ కామెంట్స్.. అసభ్యంగా, పురుషాధిక్య ధోరణిని చాటేలా ఉన్నాయని.. మహిళలను సీఎం అవమానించారని ఆరోపించింది.
మరోవైపు సీఎం నితీశ్ వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌తో పాటు కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యే నీతూ దేవి సమర్థించారు. పాఠశాలల్లో లైంగిక విద్యలో భాగంగా విద్యార్థులకు ఇలాంటి అంశాలను బోధిస్తారని .. సులభంగా అర్థం చేసుకోవడానికి సీఎం వివరించారని అన్నారు. దీనిపై బీజేపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు.