పంజాబ్‌లో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న వరుస పరిణామాలు చలి కాలంలోనూ హీట్‌ను పుట్టిస్తున్నాయి. ఇప్పటికే నేతల పరస్పర ఆరోపణలతో పంజాబ్ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. కాగా, డ్రగ్స్ కేసుకు సంబంధించి పంజాబ్ రాజకీయాలు మరోసారి వార్తల్లో నిలిచాయి. డ్రగ్స్ అక్రమ రవాణా ఆరోపణలపై అకాలీదళ్ కీలక నేత బిక్రమ్ సింగ్ మజిథియాపై పంజాబ్ పోలీసులు కేసును నమోదు చేయడం ఇప్పుడు హాట్‌టాపిక్ అయ్యింది. మాజీ కేంద్ర మంత్రి అయిన హర్ సిమ్రాత్ కౌర్ బాదల్‌కు మజిథియా సోదరుడు.
2018లో డ్రగ్స్ మాఫియాతో అక్రమ రవాణాలో సహకారం, నేరపూరిత కుట్రలపై మజిథియాపై గతంలోనే పలు ఆరోపణలు వచ్చాయి. అయితే, తాజాగా బిక్రమ్ సింగ్‌పై కేసు నమోదు చేయడం చర్చకు దారి తీసింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ ఘటన ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. ఈ పరిణామాన్ని అకాలీదళ్ నాయకులు తీవ్రంగా ఖండించారు. అధికార పక్షం, కావాలనే ప్రతీకార రాజకీయాలు చేస్తోందని అకాళీదళ్ మండిపడుతోంది.
తాజా ఘటనపై, పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ట్విటర్ వేదికగా స్పందించారు. డ్రగ్స్ మాఫియా వెనుక ఎవరున్న వారికి కఠిన శిక్షలు పడేలా చూస్తామని అన్నారు. చట్టం ముందు అందరూ సమానులే అని సిద్ధూ పేర్కొన్నారు. కాగా, కెప్టెన్ అమరీందర్ సింగ్ సీఎం ఉన్నప్పుడు ఈ కేసును పట్టించుకోలేదని సిద్ధూ ఆరోపించారు.