అంతా చట్టం చూసుకుంటుంది, చట్టం దృష్టిలో నుండి ఎవరూ తప్పించుకోలేరు అనేది మన దేశంలో బాగా వినిపించే మాట. అది సరే చట్టం చూసుకుంటుందో లేదో అన్న సంగతి పక్కన పెడితే అసలు చట్టాన్ని చూసుకునే నాధుడు ఎవరు ? నిన్న అన్ని ఎలక్ట్రానిక్ మీడియాల్లో ప్రముఖంగా వినిపించిన వార్త కేంద్ర ప్రభుత్వం నేడు లోక్సభలో నేర చట్టం (సవరణ) 2018 బిల్లును ప్రవేశపెట్టింది. 12 ఏళ్లలోపు చిన్నారులపై అత్యాచారం చేసిన కేసుల్లో దోషులకు కఠిన శిక్షలు విధించేందుకు వీలుగా నేరచట్టానికి సవరణలు ప్రతిపాదిస్తూ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందితే గత ఏప్రిల్ 21న జారీ చేసిన క్రిమినల్ లా (అమెండ్మెంట్) ఆర్డినెన్స్ రద్దవుతుంది అని.
ఇదే వార్త 2012లో కూడా ప్రధానంగా వచ్చింది అప్పుడు నిర్భయ కేసు నడుస్తోంది కాబట్టి, ఏదైనా ఇలాంటి ఒక ఘటన జరిగినప్పుడు హాదవిది చేసి ఎదో చట్టాలు చేసేస్తాం అని ఊకదంపుడు ప్రసంగాలు చేసేస్తారు, అవి నాలుగు రోజులకి మర్చిపోతారు. ఇప్పుడు కూడా ఒక రెండు మూడు ఘటనలు జరిగాయి కాబట్టి మళ్ళీ ఈ లోక్ సభలో బిల్లుల వరకు వెళ్ళింది వ్యవహారం. కఠువా, ఉన్నావ్ ఘటనల అనంతరం దేశవ్యాప్తంగా నిరసన వెల్లువెత్తడంతో కేంద్రం ఈ నిబంధనలతో ఓ ఆర్డినెన్స్ తెచ్చింది. దాని స్థానే ఇపుడు బిల్లును ప్రవేశపెట్టారు.
ప్రస్తుత బిల్లు ప్రకారం పన్నెండేళ్ల లోపు చిన్నారులపై అత్యాచారానికి మరణ శిక్ష, 16 ఏళ్ల లోపు బాలికలపై అత్యాచారానికి ఇరవయ్యేళ్ళ శిక్ష, మహిళలను రేప్ చేస్తే ఏడేళ్ల నుంచి గరిష్ఠంగా జీవితఖైదు విధించడానికి తాజా బిల్లు వీలు కల్పిస్తోంది. అంటే దోషులు చచ్చేదాకా జైల్లోనే గడపాల్సి ఉంటుందన్నది బిల్లు సారాంశం. అంతేకాదు, రేప్ కేసుల దర్యాప్తు, విచారణ అన్నీ రెండు నెలల్లో ముగిసిపోవాలి. అప్పీళ్ల దాఖలు, తీర్పులకు ఆరు నెలల గడువు ఇచ్చారు. పాపం ఈ బిల్లు కయినా మోక్షం కలుగుగాలని కోరుకుంటూ …..కామన్ మ్యాన్