కారులో మత్తుపదార్థాలు తరలిస్తున్న బీజేపీ మహిళ నేతతో పాటు మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. అరెస్ట్ అయిన మహిళ నాయకురాలిని బీజేపీ యూత్ లీడర్ పమేలా గోస్వామిగా గుర్తించారు. వివరాలు.. శుక్రవారం పమేలా గోస్వామి, తన స్నేహితుడితో కలిసి కోల్‌కతాలోని నయూ అలీపూర్ ప్రాంతంలోని ఎన్ఆర్ అవెన్యూకు వెళ్తున్నారు. అయితే అప్పటికే బీజేపీ నాయకురాలు ఒకరు మత్తు పదార్థాలు తరలిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది.
దాంతో వారు ఎన్ఆర్ అవెన్యూ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో పమేలా గోస్వామి కారులో కొకైన్ తరలిస్తున్నట్టుగా గుర్తించారు. ఆమె బ్యాగ్ ఓపెన్ చేసి చూడగా.. అందులో మత్తు పదార్థాలు ఉన్నట్టు గుర్తించారు. అలాగే కారులోని సీట్ల కింద మత్తు పదార్థాలను దాచి ఉంచినట్టు పోలీసులు గుర్తించారు. ఆమె దగ్గర నుంచి 100 గ్రాముల కొకైన్‌ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ లక్షల్లో ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.
ఇక ఘటన స్థలంలోనే ఆమెను అరెస్ట్ చేశారు. ఆ సమయంలో పమేలా గోస్వామితో ఆమె ఫ్రెండ్ ప్రబీర్ కుమార్ దేవ్‌తో పాటు ఓ బాడీగార్డు కూడా ఉన్నాడు. దాంతో పోలీసులు పమేలాతో పాటు వీరద్దరిని కూడా అరెస్ట్ చేశారు. పమేలాకు మత్తు పదర్థాలు ఎక్కడి నుంచి సరఫరా అవుతున్నాయనే వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. అలాగే మత్తు పదార్థాలను ఆమె ఎవరికైనా అందివ్వడానికి తీసుకెళ్తుందా.. లేక ఆమె వాడుతుందా అనే విషయాల గురించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పమేలా అరెస్ట్‌పై బీజేపీ నాయుకుల స్పందించారు. ‘‘చట్టం తన పని తాను చేస్తుంది. అయితే ఎవరైనా ఆమె కారులో కొకైన్ పెట్టి ఉండవచ్చు కదా.. ఇది బెంగాల్.. ఇక్కడ ఏమైనా జరగవచ్చు. పోలీసులు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో పని చేస్తున్నారు. కాబట్టి నమ్మలేం’’ అన్నారు. తొలుత ఎయిర్‌హోస్టెస్‌గా పని చేసిన పమేలా ఆ తర్వాత మోడలింగ్, టీవీ సీరియల్స్‌లో నటించారు. 2019లో బీజేపీలో చేరారు. ఆ తర్వాత ఆమెని తరువాత ఆమెను హుగ్లీ జిల్లాకు యువ మోర్చా ప్రధాన కార్యదర్శిగా, యువ మోర్చా పరిశీలకుడిగా నియమించారు.