సుప్రీం కోర్టు జడ్జ్ కి లంచం ఇస్తూ దొరికిన బీజేపీ డిప్యూటీ సీఎం అభ్యర్ధి !

BJP leader Sriramulu gives 160 cr Bribe to SC judge son-in-law

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

కర్ణాటక ఎన్నికల వేళ బీజేపీకి పెను షాక్ తగిలింది. ఇప్పటికే మైనింగ్ కింగ్, అవినీతి రారాజు గాలి జనార్ధన్ రెడ్డి అనుచరులకి పెద్ద ఎత్తున బీజేపీ టికెట్లు ఇచ్చి విమర్శలను ఎదుర్కుంటున్న వేళ గాలి ప్రధాన అనుహరుడిగా పేరున్న అధికారంలోకి వస్తే డిప్యూటీ సీఎం క్యాండిడేట్ అయిన శ్రీరాములుకు తాను చిక్కులో పడి మొత్తం కర్ణాటక బీజేపీని ఎన్నికల వేళ చిక్కుల్లో పడేశాడు. ఓ మైనింగ్ కేసు నుంచి బయటపడేందుకు గాను రూ.160 కోట్లు లంచం ఇచ్చేందుకు సాక్ష్యాత్తు సుప్రీంకోర్టు న్యాయమూర్తి అల్లుడితో మాట్లాడుతున్నట్లు ఆరోపిస్తూ బీ టీవీ ( కన్నడ ) న్యూస్ చానెల్ ఒక వీడియోను ప్రసారం చేసింది. ఇప్పుడు ఈ వీడియో కర్ణాటకలో ప్రకంపనలు సృష్టిస్తోంది.

వీడియో, మాటలు అన్నీ స్పష్టంగా ఉండటంతో… పోలింగ్ కు రెండు రోజుల ముందు అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ లుగా ప్రచారం చేసుకుంటున్న బీజేపీ పరువు పోగొట్టుకున్నట్లయింది. దీంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేగుతోంది. ఈసారి కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో గాలి జనార్ధన్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వకపోయినా ఆయన ప్రధాన అనుచరుడు శ్రీరాములుకు మాత్రం బీజేపీ టిక్కెట్ ఇచ్చింది. ఈయన బదామి నుంచి ముఖ్యమంత్రి సిద్ద రామయ్యపై శ్రీరాములు పోటీ చేస్తున్నారు. వీడియోలో జడ్జి అల్లుడితో శ్రీరాములు మంతనాల దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏకంగా రూ.160 కోట్లు ఇచ్చేందుకు శ్రీరాములు బేరసారాలు ఆడారని ఆ వీడియో బయటపెట్టిన బీ చానెల్ చెబుతోంది. మైనింగ్ కేసు నుంచి బయట పడేందుకే శ్రీరాములు ఈ బేరసారాలు జరిపినట్లు పేర్కొంది. అయితే ఈ వీడియో 2010 నాటిదని తెలుస్తోంది.

వైఎస్ హయాంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దుల్ని చెరుపేసి ఐరన్ ఓర్‌ను విదేశాలకు తరలించి వేల కోట్లు సంపాదించారు. అయితే అప్పట్లో వారిని అడ్డుకున్న వారే లేరు. ఆ సొమ్ముతో వ్యవస్థలన్నిటినీ డబ్బుతో కొనేవారు. వైఎస్ మరణం తర్వాత కొంత మంది ధైర్యం చేసి కోర్టులకు వెళ్లారు. దాంతో 2010లో మైనింగ్ కు బ్రేక్ పడింది. వ్యవహారం సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఆగిపోయిన మైనింగ్ ను మళ్లీ ప్రారంభించుకునేలా సుప్రీంకోర్టు నుంచి తీర్పు తెచ్చుకునేందుకు గాలి జనార్ధన్ రెడ్డి గ్యాంగ్ రూ. 160 కోట్లు రూపాయల డీల్ సుప్రీంకోర్టు జస్టిస్ అల్లుడితో కుదుర్చుకున్నారు. ఆ తర్వాత మైనింగ్ చేసుకోవడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. అప్పట్లో… ఈ తీర్పుపై అనేక అనుమానాలు వ్యక్తమైనా… న్యాయవ్యవస్థపై గౌరవంతో ఎవరూ నోరు మెదపలేకపోయారు.

అయితే అప్పటి వీడియో ఇప్పుడు ఎందుకు బయట పెట్టారు అనేది కూడా అనేక అనుమానాలకి తావిస్తోంది. ఈ వీడియో ఇప్పుడు బీజేపీ వర్గాల్లో కూడా ఆందోళన రేకెత్తిస్తోంది. రాష్ట్రాల సరిహద్దులను చెరిపి వేసి… రూ. 50 వేల కోట్ల విలువైన ఖనిజ సంపదను విదేశాలకు తరలించినట్లు గాలి జనార్దన్ రెడ్డిపై కేసులు ఉన్నాయి. గాలి జనార్దన్ రెడ్డికి బెయిలు కోసం హైదరాబాద్ లోని సీబీఐ న్యాయమూర్తికి కూడా లంచం ఇవ్వజూపిన కేసులో అడ్డంగా దొరికిపోయి మరలా జైలు జీవితాన్ని అనుభవించారు. గాలి జనార్దన్ రెడ్డికి సీబీఐతో క్లీన్ చిట్ ఇప్పించేందుకు బీజేపీ సిద్ధమయిందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే… కర్ణాటక, తమిళనాడు, గోవా రాష్ట్రాల సీబీఐ అధికారులు ఆధారాలు లేవని కేసు క్లోజ్ చేశారు. హైదరాబాద్ సీబీఐ అధికారులు దాఖలు చేసిన కేసుపైనే విచారణ జరుగుతోంది. అయితే ఈ సమయంలో గాలి ప్రధాన అనుచరుడు లంచం ఇచ్చే ప్రయత్నా చేయడం ఇప్పుడు ప్రకంపనలు రేపుతోంది.