బీజేపీలోనూ అంత‌ర్గ‌త ప్ర‌జాస్వామ్యం

BJP leader Yashwant Sinha comments on Demonetization

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం ప్రతిష్టాత్మ‌కంగా అమ‌లుచేసిన పెద్ద నోట్ల ర‌ద్దు, జీఎస్టీ అమలుపై ఇన్నాళ్లూ ప్ర‌తిప‌క్షాల నుంచే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. తాజాగా… సొంత పార్టీ నేత య‌శ్వంత్ సిన్హా ఆ నిర్ణ‌యాలను తీవ్రంగా త‌ప్పుబ‌ట్ట‌డంతో దేశ‌రాజ‌కీయాల్లో పెనుదుమారం చెల‌రేగింది. కేంద్ర‌ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌తో దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ గంద‌ర‌గోళంగా త‌యార‌యిందని, క్ర‌మంగా క్షీణిస్తోంద‌ని య‌శ్వంత్ సిన్హా ఓ ఇంగ్లీషు ప‌త్రిక‌కు రాసిన వ్యాసంలో విమ‌ర్శించారు. బీజేపీ నేత అయిన య‌శ్వంత్ సిన్హా ఇలా వ్యాఖ్యానించ‌డంతో… దాన్ని అస్త్రంగా మ‌లుచుకుని కాంగ్రెస్ తో పాటు ఇత‌ర ప్ర‌తిప‌క్షాలు ప్ర‌భుత్వంపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్నాయి. సొంత పార్టీ నేత‌లు మాత్రం య‌శ్వంత్ సిన్హా నిరాశ‌లో ఉన్నార‌ని, అందుకే ఇలాంటి వ్యాఖ్య‌లు చేశార‌ని భాష్యాలు చెబుతున్నారు.

కేంద్ర మంత్రులు కొంద‌రు య‌శ్వంత్ సిన్హా వ్యాఖ్య‌ల‌ను తీవ్రంగా త‌ప్ప‌బడుతున్న నేప‌థ్యంలో ఆయ‌న మ‌రోసారి త‌న వాద‌న‌ను స‌మ‌ర్థించుకున్నారు. దేశ ఆర్థిక స్థితిపై తాను చేసిన వ్యాఖ్య‌లు స‌రైన‌వే అన్నారు య‌శ్వంత్. దానిపై చ‌ర్చించేందుకు కూడా సిద్ధ‌మే అని ప్ర‌క‌టించారు. ఆర్థిక ప‌రిస్థితి క్ర‌మంగా క్షీణిస్తోంద‌ని, జీఎస్టీ అమ‌లే దీనికి ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని ఆయ‌న ఆరోపించారు. జీఎస్టీకి తాను అనుకూల‌మే కానీ… ప్ర‌భుత్వం హ‌డావిడిగా దాన్ని అమ‌లు చేసిన తీరే స‌రైన‌ది కాద‌ని య‌శ్వంత్ అభిప్రాయ‌ప‌డ్డారు. ఆర్థిక వ్య‌వ‌స్థ బ‌ల‌హీనంగా ఉన్న స‌మ‌యంలో పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేయ‌డం స‌రైన నిర్ణ‌యం కాద‌న్నారు. ప్ర‌ధాన‌మంత్రితో పాటు ఇత‌ర మంత్రులు ప్ర‌తిదానికీ గ‌త ప్ర‌భుత్వాల‌ను విమ‌ర్శించ‌డాన్నీ య‌శ్వంత్ సిన్హా త‌ప్పుబ‌ట్టారు.

అధికారంలోకి రాక‌ముందు యూపీఏ ప్ర‌భుత్వంపై తాము విమ‌ర్శ‌లు చేశామ‌ని, కానీ ఇప్పుడు ప‌ద‌విలోకి వ‌చ్చి 40 నెల‌లు గ‌డిచిన త‌ర్వాత కూడా… గ‌త ప్ర‌భుత్వాల‌ను నిందించ‌డం స‌రైన‌ది కాద‌ని య‌శ్వంత్ పార్టీ స‌హ‌చ‌రుల‌కు సూచించారు. ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు భార‌త్ వెన్నెముక‌గా ఉంద‌ని కేంద్ర‌మంత్రులు కొంద‌రు ప్ర‌చారం చేస్తున్నార‌ని, ఈ మాట‌ల‌ను తాను పూర్తిగా వ్య‌తిరేకిస్తున్నాన‌ని య‌శ్వంత్ వ్యాఖ్యానించారు. అటు య‌శ్వంత్ సిన్హా మాట‌ల‌ను బీజేపీ నేత‌లంద‌రూ వ్య‌తిరేకించ‌డం లేదు. య‌శ్వంత్ సిన్హాకు పార్టీలో మ‌ద్ద‌తిచ్చే నేత‌లూ ఉన్నారు. సినీన‌టుడు, బీజేపీ సీనియ‌ర్ నేత అయిన శ‌తృఘ్న సిన్హా చేసిన వ్యాఖ్య‌లే ఇందుకు నిద‌ర్శ‌నం. య‌శ్వంత్ వ్యాఖ్య‌ల‌ను శ‌తృఘ్న బ‌హిరంగంగానే స‌మ‌ర్థించారు. య‌శ్వంత్ వ్యాఖ్య‌లు దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు అద్దం ప‌డుతున్నాయ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. య‌శ్వంత్ చాలా ఆలోచించి మాట్లాడ‌తార‌ని, ఆయ‌న వ్యాఖ్య‌ల‌ను సీరియ‌స్ గా తీసుకోవాల‌ని పార్టీ నేత‌ల‌కు సూచించారు. య‌శ్వంత్ ను ప్ర‌శంసించాల్సింది పోయి విమ‌ర్శించ‌డం పిల్ల చేష్ట‌ల మాదిరిగా ఉంద‌ని త‌ప్పుబ‌ట్టారు. పార్టీ, జాతీయ ప్ర‌యోజ‌నాల‌ను దృష్టిలో పెట్టుకునే య‌శ్వంత్ ఈ వ్యాఖ్య‌లు చేశార‌న్న విష‌యాన్ని అంద‌రూ గ్ర‌హించాల‌ని శ‌తృఘ్న సిన్హా హిత‌వు ప‌లికారు.

మొత్తానికి మోడీ మాట‌కు ప్ర‌భుత్వంలో అమిత్ షా శాస‌నానికి పార్టీలో తిరుగులేద‌ని భావిస్తున్న స‌మ‌యంలో సీనియ‌ర్ నేత ఒక‌రు ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌ను త‌ప్పుబ‌ట్ట‌డం, ఆయన‌కు పార్టీలో మ‌ద్ద‌తు దొర‌క‌డం చూస్తుంటే… బీజేపీలో ఇన్నాళ్లూ కొన‌సాగిన నియంతృత్వానికి తెర‌ప‌డి… అంత‌ర్గ‌త ప్ర‌జాస్వామ్యం వ‌స్తోన్న సూచ‌న‌లు క‌న‌ప‌డుతున్నాయి. మ‌రి ఈ ధిక్కారాన్ని మోడీ షా ద్వ‌యం ఎలా ఎదుర్కొంటారో చూడాలి.