గత ఎన్నికల్లో మోడీ హవాతో బండి నడిపించిన బీజేపీకి ఈసారి పరిస్థితి అర్ధం అయిపోయినట్టుంది. అందుకే అన్ని చోట్లా ఒకేసారి ఎన్నికలయితే తమకు కాస్త లాభం అని భావించిన బీజేపీ, జమిలి ఎన్నికలు నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చి ఆ దిశగా వేగంగా పావులు కదుపుతోంది. వచ్చే ఏడాదిలో జరగల్సిన్స్ లోక్‌సభ ఎన్నికలతోపాటు సమయం దగ్గర పడిన అధికారం తమ పార్టీ ఉన్న రాష్టాల అసెంబ్లీ ఎన్నికలనూ నిర్వహించాలని యోచిస్తున్నది. ఈ మేరకు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా జమిలి ఎన్నికలకు తాము అనుకూలమని లాకమిషన్‌కు నిన్న లేఖరాశారు.
బీజేపీ ఆలోచన ప్రకారం లోక్‌సభతోపాటు 10 నుంచి 11 రాష్టాల అసెంబ్లీలకూ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నది. లోక్‌సభ కంటే నెలల ముందు/ లోక్ సభ ఎన్నికల తరువాత ఏడాదిన్నరలోపు ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు కూడా కలుపుకుపోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీల గడువు వచ్చేఏడాది జనవరితో ముగుస్తున్నా, కొద్దినెలల్లో జరిగే లోక్‌సభ ఎన్నికలతోపాటు ఈ రాష్టాల ఎన్నికల నిర్వహణకు కొన్నినెలలపాటు గవర్నర్ పాలన విధించే అవకాశం ఉన్నది అని ఆయన అన్నారు.
ఇక తరవాత జూన్ సమయానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మిజోరంలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి దీంతో వీటన్నిటినీ కలిపి ఒకే సారి ఎన్నికలకి వెళ్దామని బీజేపీ భావిస్తోంది. అయితే కొన్ని విపక్ష పార్టీలు మాత్రం ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని, ప్రజాస్వామ్య వ్యతిరేకమని విమర్శిస్తున్నాయి. అయినప్పటికీ, ఏకకాల ఎన్నికల వల్ల ఖర్చు తగ్గుతుందని, ఏడాది పొడవునా ఎన్నికల వాతావరణం లేకుండా చేయవచ్చని బీజేపీ వాదిస్తోంది. అయితే జమిలీ ఎన్నికలకి అన్ని పార్టీల అభిప్రాయాన్ని లా కమిషన్ తీసుకుంటోంది. దాని ప్రకారం బీజేపీ, ఎన్డీఏతో పాటు అకాలీదళ్, ఏఐఏడీఎంకే, సమాజ్ వాదీ, టీఆర్ఎస్ జమిలీ ఎన్నికలను సమర్ధించగా, కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, టీడీపీ, జేడీఎస్, వామపక్షాలు మాత్రం వ్యతిరేకిస్తున్నాయి.