Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మద్యపానానికి వ్యతిరేకంగా మహిళలు దేశవ్యాప్తంగా పోరాటంచేస్తోంటే… మహారాష్ట్ర మంత్రి ఒకరు మాత్రం విచిత్ర సలహా ఇచ్చారు. మద్యం విక్రయాలు బాగా పెరగాలంటే… వాటికి అమ్మాయిల పేర్లు పెట్టాలని బీజేపీ మంత్రి గిరీష్ మహాజన్ వ్యాఖ్యానించారు. గిరిష్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద దుమారమే చెలరేగుతోంది. ఢిల్లీకి చెందిన షుగర్ ఫ్యాక్టరీ యుజమాని ఒకరు మహారాజా పేరుతో మద్యం అమ్మకాలు కూడా జరుపుతుంటారు. ఆయన నిర్వహించిన ఓ కార్యక్రమానికి గిరీష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ మధ్యకాలంలో అనేక ఉత్పత్తులకు మహిళల పేర్లు పెట్టి అమ్ముతున్నారని, పొగాకు ఉత్పత్తులకు అంత గిరాకీ ఉండడానికి కారణం వాటికి మహిళల పేర్లు పెట్టడమే అని మంత్రి గారు సెలవిచ్చారు. పనిలో పనిగా తనను కార్యక్రమానికి ఆహ్యానించిన ఫ్యాక్టరీ ఓనర్ కు ఓ ఉచిత సలహా కూడా ఇచ్చారు. ఆయన మద్యం విక్రయాలను పెంచుకోవాలంటే… మహారాజాకు బదులుగా మహారాణి అని పేరు మార్చుకోవాలని సూచించి తన ఔదర్యాతను చాటుకున్నారు.
మంత్రి హోదాలో ఉండి గిరీష్ ఈ వ్యాఖ్యలు చేయడం చూస్తే… ప్రజాప్రతినిధిగా ఆయన ఎంత బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. నిజానికి ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా మనుగడ సాగించేది ఆయా రాష్ట్రాల్లో మద్యం అమ్మకాల ద్వారానే. ఇది అందరికీ తెలిసిన సత్యమే అయినా… మద్యాపానాన్ని ఎవరూ ప్రోత్సహించరు. ఏ రాజకీయ నాయకుడూ మద్యం తాగమని బహిరంగ సభల్లో ప్రజలకు సలహా ఇవ్వరు. అందరూ మద్యాపానానికి వ్యతిరేకంగానే మాట్లాడుతుంటారు. కానీ మంత్రి హోదాలో ఈ వ్యాఖ్యలు చేసి గిరిష్ సంచలనం సృష్టించారు. ప్రస్తుతం మహారాష్ట్రలోని చాలా ప్రదేశాల్లో మద్యనిషేధం ఉద్యమం సాగుతోంది. అనేక చోట్ల మహిళలు ధర్నాలు, ఆందోళనలు నిర్వహిస్తున్నారు. కానీ ఆ రాష్ట్ర మంత్రి మాత్రం మద్యం అమ్మకాలు ఎలా పెంచుకోవాలో సలహా ఇస్తుండడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. బీజేపీపై విమర్శలు గుప్పించడానికి అవకాశం కోసం కాచుక్కూర్చున్న ప్రతిపక్ష కాంగ్రెస్, మిత్రపక్షం శివసేనకు గిరిష్ వ్యాఖ్యలు అనుకోని వరంగా మారాయి.