చావు భయంతో ఆత్మహత్య చేసుకుంటున్న బీజేపీ.

BJP Ministers wants to resign as Ministers in AP Cabinet
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

చావు ముంచుకొస్తుందన్న భయంతో ఆత్మహత్య చేసుకోవడం కాస్త వింతగా అనిపించినా అలాంటి సంఘటనలు లేకపోలేదు. ఒత్తిడిని ఎదుర్కోవడంలో విఫలం అయ్యే వాళ్ళు ఇలాంటి అనాలోచిత చర్యలకు పాల్పడతారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ తీరు కూడా అలాగే వుంది. విభజన చట్టంలో హామీల అమలుతో పాటు అందులో లేనివి కూడా చేస్తాం అని ఊదరగొట్టి టీడీపీ తో పొత్తు పెట్టుకుని 2014 ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ ఆ పై అసలు ఆ విషయమే గుర్తు లేనట్టు ప్రవర్తించింది. రాజకీయ ఆరాటం, పోరాటంలో భాగంగా ఎత్తులు, పై ఎత్తులతో బండి నడపొచ్చని డిసైడ్ అయ్యింది. సీఎం చంద్రబాబు మెతక వైఖరి కూడా అందుకు ఓ కారణం. అయితే ఒక్కసారిగా సీన్ మారిపోయింది. పార్లమెంట్ వేదికగా ఆంధ్ర ఎంపీలు మరీ ముఖ్యంగా టీడీపీ ఎంపీలు దూకుడు గా వ్యవహరించడంతో వారి స్పీడ్ కి బ్రేకులు వేద్దామని కొన్ని కాకి లెక్కలతో బీజేపీ నాయకులు ముందుకు వచ్చారు. అయితే లెక్కలు తేలుస్తామని పవన్ మేధావులతో నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేయడంతో బీజేపీ పంటి కింద రాయి పడింది.

మలి విడత బడ్జెట్ సెషన్ లో కూడా టీడీపీ దూకుడు ఇలాగే కొనసాగుతుందని చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో బీజేపీ కి ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి. ఈ సమయంలో కొందరు బీజేపీ నాయకులు చేస్తున్న ఎదురు దాడితో పరిస్థితి ఇంకాస్త సంక్లిష్టంగా మారింది. దీంతో బీజేపీ మీద ఒత్తిడి పెరిగింది. విభజన హామీల మీద మాట తప్పి రాజకీయాలతో నెట్టకొద్దాం అన్న ప్లాన్ రివర్స్ అయ్యిందని బీజేపీ నేతలకు కూడా అర్ధం అయ్యింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజల్లోకి వెళ్లి ఒక్క మీటింగ్ కూడా పెట్టే పరిస్థితి లేదు. ఈ సమస్యని అధిగమించడానికి సానుకూల ఆలోచనలు చేయాల్సిన బీజేపీ ప్రతికూల ధోరణితో ముందుకు వెళుతోంది. అవసరం అయితే రాష్ట్ర మంత్రి వర్గం నుంచి తప్పుకుంటామని అంటోంది. ఎటూ మార్చి ఐదు న కేంద్రంలో టీడీపీ మంత్రులు ఇదే అస్త్రం ప్రయోగిస్తారని తెలిసే ముందుగా ఈ ప్రకటన చేసింది. అయినా బీజేపీ మంత్రులు రాజీనామా వల్ల రాష్ట్రంలో టీడీపీ కి వచ్చే నష్టం ఏమీ లేదు. అటు కేంద్రంలో లెక్కలు , రాజకీయ సమీకరణాలు అంత తేలికగా లేవు. ఈ విషయం బాగా అర్ధం చేసుకున్న ఓ సీనియర్ బీజేపీ నాయకుడు ఆంధ్రాలో జరుగుతున్న తతంగం చూసి చావు భయంతో మా పార్టీ ఆత్మహత్య చేసుకుంటోంది అని సన్నిహితులతో వ్యాఖ్యానం చేస్తున్నాడట.