బీజేపీ ఎమ్మెల్యే నోటిదురుసు

BJP MLA Gyandev Ahuja comments on cow smuggler

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ప్ర‌జా జీవితంలో ముఖ్యంగా అధికారంలో ఉన్న‌వారు ఆచితూచి మాట్లాడాల్సిఉంటుంది. కానీ కొంద‌రు నేత‌లు ఇష్టానుసారం నోటికి ప‌నిచెబుతుంటారు. ఏ పార్టీ ఇందుకు అతీతం కాదు. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డంలో ఒక‌రితో ఒక‌రు పోటీప‌డుతుంటారు. కేంద్రంలోనూ, చాలా రాష్ట్రాల్లోనూ అధికారంలో ఉన్న బీజేపీ నేత‌లు మ‌రింత ఎక్కువ‌గా నోటిదురుసు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. వారిలో బీజేపీ రాజ‌స్థాన్ ఎమ్మెల్యే జ్ఞాన్ దేవ్ అహూజా ఒక‌రు. గతేడాది ఢిల్లీలోని జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ యూనివ‌ర్శిటీకి, ప్ర‌భుత్వానికి మ‌ధ్య ప్ర‌తిష్టంభ‌న నెల‌కొన్న స‌మ‌యంలో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర క‌ల‌క‌లం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. జేఎన్ యూ వ‌ర్శిటీలో ప్ర‌తిరోజూ వంద‌ల సంఖ్య‌లో మ‌ద్యం బాటిళ్లు, కండోమ్స్ ద‌ర్శ‌న‌మిస్తాయ‌ని వివాదాస్ప‌దంగా వ్యాఖ్యానించారు. దీనిపై స‌ర్వత్రా విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌య్యాయి.

విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు జ‌రిపాయి. అయినా జ్ఞాన్ దేవ్ వైఖ‌రిలో మార్పు రాలేదు. తాజాగా ఆవుల గురించి మాట్లాడే సంద‌ర్భంలోనూ జ్ఞాన్ దేవ్ అనుచిత వ్యాఖ్య‌లుచేశారు. రాజస్థాన్ లో గ‌త శ‌నివారం ఆవుల అక్ర‌మ‌ర‌వాణాకు ప్ర‌య‌త్నించిన జకీర్ ఖాన్ అనే వ్య‌క్తిని పోలీసులు అరెస్టు చేశారు. జ‌కీర్ న‌డుపుతున్న ట్ర‌క్కును పోలీసులు ఆపేందుకు ప్ర‌య‌త్నించ‌గా..అత‌ను బారికేడ్లు ఢీకొట్టి పారిపోయాడు. విష‌యం తెలిసిన స్థానికులు జ‌కీర్ ట్ర‌క్కును అడ్డ‌గించి అత‌డిపై దాడిచేశారు. అనంత‌రం అత‌డిని పోలీసుల‌కు అప్ప‌గించారు. దీనిపై స్పందించిన జ్ఞాన్ దేవ్ వివాదాస్ప‌దంగా మాట్లాడారు. ఆవు మ‌న‌కు అమ్మ‌. ఆవులను అక్ర‌మంగా త‌ర‌లించినా..వాటిని చంపినా..వారు కూడా హ‌త్య‌కు గుర‌వుతారు అని హెచ్చ‌రించారు. ఈ ఘ‌ట‌న‌లో నిందితుడిపై ఎవ‌రూ దాడిచేయ‌లేద‌ని, పోలీసుల నుంచి త‌ప్పించుకునే క్ర‌మంలో వేగంగా న‌డప‌డంతో ట్ర‌క్కు బోల్తా ప‌డి అత‌ను గాయ‌ప‌డ్డాడ‌ని జ్ఞాన్ దేవ్ తెలిపారు. అటు అహూజా వ్యాఖ్య‌ల‌పై ప్ర‌తిప‌క్షాలు విరుచుకుప‌డుతున్నాయి.