1962 యుద్దం వెన‌క చైనా అస‌లు వ్యూహం

The Main Motto of China in 1962 War With India
 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

1962లో జ‌రిగి భార‌త్ – చైనా యుద్ధం ఈ రెండు దేశాల‌తో పాటు ఆసియాఖండంలోనూ అనేక మార్పుల‌కు కార‌ణ‌మ‌యింది. ఆ యుద్ధంలో ఓడిపోవ‌డం వ‌ల్ల  ఆనాటి ప‌రిస్థితుల్లో ప్ర‌పంచం ముందు భార‌త్ బ‌ల‌హీన దేశమ‌న్న ముద్ర‌ప‌డ‌గా..చైనా మాత్రం అత్యంత బ‌లోపేత‌మైన దేశంగా గుర్తింపు పొందింది. ఒక ర‌కంగా ఆసియాలో చైనా ఆధిప‌త్యానికి ఆ యుద్ధ‌మే మూల‌కార‌ణం. అలాగే అమెరికా, ర‌ష్యా, త‌ర్వాత చైనా ప్ర‌భావ‌వంత‌మైన దేశంగా ఎద‌గ‌డానికీ ఆ యుద్ధ‌మే బాట‌లు ప‌రిచింది. భార‌త్ మాత్రం ఆ యుద్ధం నుంచి అనేక గుణ‌పాఠాలు నేర్చుకుంది. యుద్ధం త‌ర్వాత భారత విదేశాంగ విధానం స‌మూల మార్పుల‌కు గుర‌యింది. యుద్ధంలో భార‌త్ ఓడిపోయింద‌న్న దిగులుతోనే అప్ప‌టి ప్ర‌ధాని జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ అనారోగ్యానికి గురై క‌న్నుమూశార‌న్న ప్ర‌చార‌మూ ఉంది. ఇంత‌గా ప్ర‌భావం చూపిన ఆ యుద్ధానికి ఇప్ప‌టిదాకా అంద‌రూ భార‌త్ కార‌ణం అనుకున్నారు. నెహ్రూ అవ‌లంబించిన ఫార్వ‌ర్డ్ పాల‌సీ యుద్ధానికి దారితీసింద‌న్న భావ‌న ఉంది. ఇండియాస్ చైనా వార్ పుస్త‌క ర‌చ‌యిత నెవిల్లే మ్యాక్స్ వెల్ తో పాటు మ‌రికొంద‌రు గ‌తంలో ఈ వాద‌నే చేశారు.

అయితే ప్ర‌పంచంతా మంతా న‌మ్ముతున్న ఈ వాద‌న‌లో నిజం లేద‌ని స్వీడ‌న్ వ్యూహాత్మ‌క వ్య‌వ‌హారాల నిపుణుడు బెర్టిల్ లింట్న‌ర్ త‌న పుస్త‌కం చైనాస్ ఇండియా వార్ లో తేల్చిచెప్పారు. యుద్ధానికి భార‌త్ ఏ మాత్రం కార‌ణం కాద‌ని ఆయ‌న  స్ప‌ష్టంచేశారు. చైనా  క‌మ్యూనిస్ట్ నేత మావో జెడాంగ్ స్వార్థం, అత్యుత్సాహ‌మే 1962 భార‌త్, చైనా యుద్ధానికి దారితీసింద‌ని బెర్టిల్ లింట్న‌ర్ కుండబ‌ద్ధ‌లు కొట్టారు. ఆక్స్ ఫ‌ర్డ్ యూనివ‌ర్శిటీ ప్ర‌చురించిన ఈ పుస్త‌కంలో మావో వ్య‌వ‌హార‌శైలితో పాటు అనేక విష‌యాల‌ను ఆయ‌నతెలియ‌జేశారు. దాని ప్ర‌కారం…చైనాను ఆధునిక దేశంగా మార్చ‌డానికి 1958 ప్రాంతంలో మావో గ్రేట్ లీప్ ఫార్వార్డ్ ప్రారంభించారు. పారిశ్రామిక ఉత్ప‌త్తుల్లో బ్రిట‌న్ ను 15 ఏళ్ల‌లో అధిగమించ‌డానికి గ్రేట్ లీప్ ఫార్వార్డ్ ను మావో మొద‌లుపెట్టారు. ఇందులో భాగంగా ప్ర‌తి చైనీయుడు దేశంలోనే ఉక్కుత‌యారీ ప్రారంభించాల‌ని నిర్దేశించారు. పారిశ్రామికీక‌ర‌ణ పెరిగితే దేశంలో ఆహార ధాన్యాల ఉత్ప‌త్తిని గంప‌గుత్త‌గా పెంచ‌వ‌చ్చ‌ని మావో భావించారు. అయితే ఈ విధానం అనుకున్న ల‌క్ష్యాన్ని నెర‌వేర్చ‌కపోగా..చైనాకు కోలుకోలేని న‌ష్టం మిగిల్చింది. విస్తృత పారిశ్రామికీక‌ర‌ణ అటుంచి..తీవ్ర దుర్భిక్షం ఏర్ప‌డింది.The Main Motto of China in 1962 War With India

1958-61 మ‌ధ్య కాలంలో 4 కోట్ల నుంచి 5 కోట్ల మందిదాకా చ‌నిపోయారు. ఈ ప‌రిణామం మావోను తీవ్రంగా కుంగ‌దీసింది.  చాలా రోజులు ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. ఎప్పుడూ త‌న బెడ్ రూంలో కూర్చుని ఏదో ఆలోచిస్తూ గ‌డిపేవారు. అధికారాన్ని కోల్పోయిన‌ట్టుగా భావించేవారు. 1962 జ‌న‌వ‌రిలో క‌మ్యూనిస్టు పార్టీ కేంద్ర క‌మిటీ స‌మావేశాన్ని ఏర్పాటుచేసినప్పుడు ఆయ‌న‌కు చాలా త‌క్కువ‌మంది నుంచి మ‌ద్ద‌తు ల‌భించింది. దేశంలో త‌న‌పై తీవ్ర వ్య‌తిరేక‌త ఉంద‌ని గ్ర‌హించిన మావో త‌న వ్యూహాల‌కు ప‌దును పెట్టారు. ప్ర‌జ‌ల దృష్టి మ‌రల్చ‌డానికి దేశానికి బ‌య‌ట శ‌త్రువు ఉన్నార‌ని చెప్ప‌డం ఒక్క‌టే ఆయ‌న‌కు మార్గంగా తోచింది. స్వ‌దేశంలో త‌న ప‌ట్టు పెంచుకోవ‌డానికి ఓ యుద్ధం అవ‌స‌ర‌మ‌ని మావో భావించారు.  ఈ త‌రుణంలో టిబెట్ లో చైనా ఆక్ర‌మ‌ణ‌ల‌కు వ్య‌తిరేకంగా తిరుగుబాటు చేసిన ద‌లైలామాకు 1959 ప్రాంతంలో భార‌త్ ఆశ్ర‌యం ఇవ్వ‌డం మావోకు సాకుగా దొరికింది. భార‌త్ సున్నిత‌ల‌క్ష్యంగా క‌నిపించ‌డంతో చైనాను యుద్ధ‌రంగంలోకి న‌డిపించారు మావో.  దేశ‌ప్ర‌జ‌ల్లో త‌న‌కొచ్చిన చెడ్డ‌పేరును తొల‌గించుకోవ‌డంతో పాటు కొన్ని అంత‌ర్జాతీయ ల‌క్ష్యాలు నెర‌వేర్చుకోవ‌డానికి యుద్ధం అనివార్యంగా భావించారు మావో.The Main Motto of China in 1962 War With India

ఆసియా, ఆఫ్రికాలో కొత్త‌గా స్వాతంత్య్రం పొందిన దేశాల్లో చైనా ప్రాదేశిక రాజ‌కీయ ఆధిప‌త్యాన్ని కొన‌సాగించ‌డం, వ‌ర్ధ‌మాన దేశాల్లో భార‌త్ నాయ‌క‌త్వ స్థాయికి ఎద‌గ‌కుండా అడ్డుక‌ట్ట వేయ‌డం  త‌క్ష‌ణ క‌ర్త‌వ్యంగా భావించారు. అనుకున్నట్టే ఆయ‌న ల‌క్ష్యాలు నెర‌వేరాయి. యుద్దం కార‌ణంగా చైనా ప్ర‌జ‌లు మావోకు మ‌ద్దతుగా నిలిచారు. గెలుపు త‌ర్వాత‌..మావో దేశంలో తిరుగులేని నాయ‌కుడిగా మారారు. భార‌త్ ఓట‌మితో అంత‌ర్జాతీయంగానూ ప‌ట్టు సాధించారు. యుద్దం త‌ర్వాత భార‌త్ కు బ‌దులుగా చైనా తృతీయ ప్ర‌పంచ‌దేశాల‌ నాయ‌క‌త్వ‌స్థాయికి ఎదిగింది. ఇక ఈ యుద్దం విష‌యంలో భార‌త్ పై ప్ర‌ధానంగా ఓ ఆరోప‌ణ వినిపించేది. భార‌త‌దేశానికి స‌రైన నిఘా స‌మాచారం లేద‌ని, 1959 నుంచి చైనా స‌రిహ‌ద్దుల్లో భారీగా సైన్యాన్ని మోహరిస్తున్నా..భార‌త్ గుర్తించ‌లేక‌పోయింద‌న్న అప‌ప్ర‌ద ఉంది. అది నిజం కాదు. స‌రిహ‌ద్దుల్లో చైనా క‌ద‌లిక‌ల  గురించి నెహ్రూ ప్ర‌భుత్వంలోని ఇంటెలిజెన్స్ విభాగ‌పు అధిప‌తి భోలానాథ్ ముల్లిక్ ప్ర‌భుత్వానికి ప‌దే ప‌దే హెచ్చ‌రిక‌లు చేశారు. అయితే భార‌త్ కు వ్య‌తిరేకంగా చైనా యుద్ధ సన్నాహాలు చేస్తోంద‌న్న విష‌యాన్ని నెహ్రూ న‌మ్మ‌లేక‌పోయారు. అలాగే గ్రేట్ లీప్ ఫార్వ‌ర్డ్ విఫ‌లం కావ‌డంతో చైనీయులు ఆక‌లితో అల‌మ‌టిస్తున్నార‌ని నెహ్రూ గుర్తించార‌ని, అదే స‌మ‌యంలో ఆయ‌న ఫార్వ‌ర్డ్ పాల‌సీ విధానాన్ని అనుస‌రించార‌నీ ప్ర‌చారం జ‌రిగింది. దానివ‌ల్ల 1962 మ‌ధ్య‌లో స‌రిహ‌ద్దుల్లో ఇరుదేశాల సైన్యాల మ‌ధ్య ఉద్రిక‌త్త‌లు పెచ్చుమీరి యుద్ధానికి దారితీసింద‌న్న వాద‌న‌లోనూ నిజం లేదు. యుద్ధం ఉద్దేశాల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించ‌డానికి అల్లిన క‌ట్టుక‌థ ఇద‌ని లింట్న‌ర్ విశ్లేషించారు.