భారతీయ జనతా పార్టీ శాసన సభ్యురాలు కిరణ్ మహేశ్వరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కరోనా బారినపడిన ఆమె కొద్దిరోజులుగా హర్యానా గుర్గావ్లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కొద్దిసేపటి కిందట మరణించారు. ఆమె మరణం పట్ల లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాడ సంతాపాన్ని తెలిపారు.
కిరణ్ మహేశ్వరి.. రాజస్థాన్‌లోని రాజసమంద్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు ఆమె విజయం సాధించారు. అన్‌లాక్ అనంతరం ఆమె విస్తృతంగా నియోజకవర్గంలో పర్యటించడంతో కరోనా బారిన పడ్డారు. మూడు వారాల కిందట కరోనా లక్షణాలతో మేదాంత ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆమెకు డాక్టర్లు ఆధునిక వైద్య చికిత్సను అందిస్తూ వచ్చారు. అయినా ఆమె అరోగ్యం కుదుటపడకపోవడంతో రెండు రోజుల కిందట ఐసీయూకు తరలించారు.
వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. కిరణ్ మహేశ్వరి భౌతిక దేహాన్ని ఆసుపత్రి నుంచి రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు తరలించనున్నారు. సోమవారమే అంత్యక్రియలు నిర్వహిస్తారని బీజేపీ నాయకులు చెబుతున్నారు. ఆమె మరణం పట్ల ఓం బిర్లా తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. మహిళా స్యయం సాధికారత కోసం ఆమె శ్రమించారని ఆయన తెలిపారు. సుదీర్ఘకాలం పాటు కిరణ్ మహేశ్వరి ప్రజాసేవలో గడిపారని ఆయన అన్నారు.