Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఉన్నావ్ సామూహిక అత్యాచారం కేసులో ఎట్టకేలకు బీజేపీ ఎమ్మెల్యే కుల్ దీప్ సింగ్ సెంగార్ ను సీబీఐ అదుపులోకి తీసుకుంది. ఉదయం ఐదుగంటల ప్రాంతంలో సీబీఐ అధికారులు సెంగార్ ను అదుపులోకి తీసుకున్నారు. లక్నోలోని సీబీఐ కార్యాలయంలో అధికారులు ఆయన్ను ప్రశ్నించారు. బాలికపై సామూహిక అత్యాచారం, ఆమె తండ్రి కస్టడీలో మరణించడంపై సీబీఐ అధికారులు సెంగార్ పై మూడు వేర్వేరు కేసులు నమోదుచేశారు. ఉత్తర్ ప్రదేశ్ లోని ఉన్నావ్ కు చెందిన 16 ఏళ్ల బాలిక కుల్ దీప్ సింగ్ సెంగార్ పై సామూహిక అత్యాచారం ఆరోపణలు చేసింది.
గత ఏడాది సెంగార్, అతని సోదరుడు, అనుచరులు తనపై సామూహిక అత్యాచారం జరిపారని పోలీసులకు ఫిర్యాదుచేసింది. ఎన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదుచేసినా… పట్టించుకోవడంలేదని ఆవేదన చెందుతూ యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఇంటిముందు ఆమె ఆత్మహత్యాయత్నం చేయడంతో ఈ దారుణం వెలుగుచూసింది. దేశవ్యాప్తంగా ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ కేసు విషయంలో మరో విషాదం కూడా చోటుచేసుకుంది. బాధితురాలి బంధువులకు, ఎమ్మెల్యే బంధువులకు మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఎమ్మెల్యే సోదరుడు బాధితురాలి తండ్రిని దారుణంగా కొట్టాడు. అయినప్పటికీ పోలీసులు ఎమ్మెల్యేను, ఆయన బంధువులను ఏమీ అనకుండా… బాధితురాలి తండ్రినే అరెస్టు చేశారు.
ఆయన కస్టడీలో మరణించడంతో ఈ కేసు మరింత సంచలనంగామారింది. యూపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. సెంగార్ పై ఎఫ్ ఐఆర్ నమోదు చేసినప్పటికీ… అరెస్టు చేయకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తంచేశారు. అలహాబాద్ హైకోర్టు కూడా యూపీ ప్రభుత్వ తీరును తప్పుబట్టింది. ఉత్తర్ ప్రదేశ్ లో లా అండ్ ఆర్డర్ వ్యవస్థ కుప్పకూలిపోయిందని న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు. తనపై అత్యాచారం జరిగిందని ఓ యువతి గత ఆరునెలలుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నప్పుడు పోలీసులు నిందితుణ్ని ఎందుకు అదుపులోకి తీసుకోలేదని ప్రశ్నించారు. ప్రతీదానికి ఆధారాలు కావాలా… ఆధారాలు లేకపోతే కేసులు నిలిపివేస్తారా… యువతికి అన్యాయం జరిగినప్పుడు ఆమె పోలీసుల వద్దకు కాకుండా ఇంకెక్కడకు వెళ్తుంది అని న్యాయమూర్తులు మండిపడ్టారు. ఈ నేపథ్యంలో… ఎట్టకేలకు సీబీఐ అధికారులు సెంగార్ ను అరెస్టు చేశారు.