Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బడ్జెట్ తర్వాత బీజేపీ, టీడీపీ మధ్య సంబంధాలు ముగింపు దశకు చేరుకున్నట్టు కనిపిస్తున్నాయి. ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శల వర్షం కురిపించుకుంటున్నారు. గతంలో బీజేపీ నేతలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో టీడీపీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా చూసీ చూడనట్టు వ్యవహరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర నేతలు బడ్జెట్ తర్వాత మాత్రం సహనం కోల్పోయారు. కేంద్రప్రభుత్వతీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న నేతలు..బీజేపీతో పొత్తుపై తుదినిర్ణయం తీసుకునేందుకు సిద్ధమయ్యారు.ఇన్నాళ్లూ టీడీపీ మౌనం మాత్రమే తెలిసిన రాష్ట్ర బీజేపీ నేతలకు ఈ పరిణామం మింగుడు పడడం లేదు. అదే సమయంలోబడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగిందన్న భావన ప్రజల్లో బలంగా ఉండడం, అది బీజేపీపై ఆగ్రహంగా మారుతుండడంతో ఆ పార్టీ నేతలు ఆత్మరక్షణలో పడ్డారు.
టీడీపీ విమర్శలను తిప్పికొట్టాలని అధిష్టానం నుంచి ఆదేశాలు వెలువడడం, మాట్లాడితే ప్రజలు ఏమనుకుంటారోనన్న భయం బీజేపీ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. టీడీపీ చేస్తున్న ఆరోపణలకు ప్రతిగా బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలు గమనిస్తే ఈ విషయం అర్ధమవుతుంది. విభజన బాధిత ఏపీకి బడ్జెట్ లో అన్యాయం జరిగిందన్నది కాదనలేని వాస్తవం. అన్ని పార్టీలే కాదు…పొరుగు రాష్ట్రాలు సైతం ఏపీకి అన్యాయం జరిగిందని అంగీకరిస్తున్నాయి. అయితే రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం బడ్జెట్ బాగుందంటూ వ్యాఖ్యానాలు చేయక తప్పని స్థితి. టీడీపీపైనా బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలు ఇలానే ఉంటున్నాయి. బడ్జెట్ పై అసహనం ఉంటే అడగాలి కానీ, విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని బీజేపీ ఎమ్మెల్సీ సోమూ వీర్రాజు అంటున్నారు. మంత్రి నారా లోకేశ్ కు 19 అవార్డులు రావడానికి కేంద్రం ఇచ్చిన నిధులు కారణం కాదా అని ఆయన ప్రశ్నించారు.
మిత్రపక్షంగా ఉన్న తమపై విమర్శలు చేయడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వంపై టీడీపీఎంపీలు రాయపాటి, టీజీవెంకటేశ్ విమర్శలు చేయడాన్ని సోము వీర్రాజు తప్పుబట్టారు. పొగాకు బండిల్స్ లో రాళ్లు నింపి చైనాకు ఎగుమతి చేసిన చరిత్ర రాయపాటిదని…అలాంటి వ్యక్తి కూడా మోడీని విమర్శిస్తారా అని ఆయన మండిపడ్డారు. మోడీది పేదల ప్రభుత్వమని, వ్యాపారాలు చేసుకునే ఇలాంటి ఎంపీల కోసం పనిచేసే ప్రభుత్వం కాదని అన్నారు. కేంద్రంలో చంద్రబాబు గతంలో కాంగ్రెస్ మద్దతుతో చక్రం తిప్పారని, ఇద్దరువ్యక్తులను ప్రధానమంత్రులను చేశారని, మళ్లీ అలాంటి ప్రభుత్వాన్ని తీసుకురావాలని ఈ ఇద్దరు ఎంపీలు భావిస్తున్నట్టున్నారని ఎద్దేవా చేశారు.పోలవరం ప్రాజెక్టును కేంద్రానికి అప్పజెప్పేస్తామని ప్రకటించిన చంద్రబాబు ఇప్పుడు మరో కంపెనీని ఎందుకు తెరపైకి తెచ్చారని సోము వీర్రాజు ప్రశ్నించారు. మొత్తానికి తాజా పరిణామాలు చూస్తుంటే రెండు పార్టీల మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితిలు నెలకొన్నాయి.