Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
చనిపోయిన వారి గురించి మాట్లాడేటప్పుడు ఎవరైనా చాలా జాగ్రత్త వహిస్తారు. వీలైనంతమేరకు వారిని గౌరవిస్తూనే మాట్లాడతారు. శత్రువులనయినా సరే చనిపోయిన తర్వాత ఏమీ అనకూడదన్నది మనదేశంలో అందరూ పాటించే విధానం. అందుకే చనిపోయిన వారిని ఎవరూ ఏమీ అనరు. వారనుద్దేశించి ఎలాంటి అనుచిత వ్యాఖ్యలూ చేయరు. సామన్యుల విషయమే ఇలా ఉంటే దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో పోరాడుతూ ప్రాణాలొదిలిన మన అమర జవాన్ల గురించి ఎంత హుందాగా స్పందించాలి? వారి త్యాగాలను ఎన్ని విధాలుగా కొనియాడాలి? ఇలా చేయడానికి మనసు రాకపోయినా..కనీసం వారి మరణాన్ని మాత్రం తేలికగా తీసివేస్తూ మాట్లాడకూడదు. నిజానికి సామాన్యులెవ్వరూ ఈ తరహా వ్యాఖ్యలు చేయరు.
జవాన్ల మరణవార్త తెలిసినప్పుడూ అందరూ తమకు తోచిన పద్ధతిలో బాధను వ్యక్తంచేస్తారు. వారి కుటుంబాలను తలచుకుని నిట్టూరుస్తారు. మరి మామూలు ప్రజలే ఇలా ఉన్నప్పుడు వారికి ప్రాతినిధ్యం వహించే రాజకీయ నాయకులు ఎంత పెద్దరికంగా మాట్లాడాలి? కానీ బీజేపీ నేత ఒకరు మాత్రం అమర జవాన్ల అంతులేని త్యాగాలను గడ్డిపోచలాగా తీసిపడేశారు. అత్యంత నిర్దయమైన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ నియోజకవర్గ ఎంపీ అయిన 77 ఏళ్ల నేపాల్ సింగ్ దక్షిణ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్ కౌంటర్ పై స్పందిస్తూ దారుణంగా మాట్లాడారు.
సరిహద్దుల్లో జవాన్లు శత్రువులతో పోరాడుతుంటారు. చస్తుంటారు. అందులో కొత్తేముంది? ఆర్మీలో సిబ్బంది అంటేనే ఏదో ఒకరోజు యుద్ధంలో ప్రాణాలు వదలాల్సిందే అని నేపాల్ సింగ్ వ్యాఖ్యానించారు. ఆయన మాటలు ఒక్కసారిగా తీవ్ర దుమారం రేపాయి. ప్రతిపక్షాలతో పాటు సొంత పార్టీ నేతలు సైతం నేపాల్ సింగ్ పై విరుచుకుపడడంతో ఆయన మాటమార్చారు. సైనికులను, అమరవీరులను అవమానించే విధంగా తాను వ్యాఖ్యలు చేయలేదని, తన వ్యాఖ్యలు ఒకవేళ ఆ అర్దం వచ్చేలా ఉంటే క్షమించాలని కోరారు. సైనికుల ప్రాణాలు కాపాడేలా ఓ ఆయుధం కనిపెట్టాలని తాను శాస్త్రవేత్తలను అడిగానని నేపాల్ సింగ్ చెప్పుకొచ్చారు.