Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బలపరీక్షలో నెగ్గలేమని గ్రహించి…వ్యూహాత్మకంగా వ్యవహరించి..చివరి నిమిషంలో యడ్యూరప్పతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయించి పరువు నిలబెట్టుకున్నప్పటికీ… బీజేపీని కర్నాటక కష్టాలు వీడేలా కనిపించడం లేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో జరిపిన బేరసారాల టేపులు… బీజేపీని మరిన్ని చిక్కుల్లో పడేసే సూచనలు కనిపిస్తున్నాయి. బీజేపీ ప్రలోభపెట్టిన ఎమ్మెల్యేల్లో ఒకరిగా భావిస్తున్న బీసీ పాటిల్ సంచలన విషయం వెల్లడించారు. బలపరీక్షలో బీజేపీకి అనుకూలంగా ఓటువేస్తే… మంత్రి పదవితో పాటు మరెన్నో ఇస్తామని బీజేపీ తనను ప్రలోభపెట్టిందని బీసీ పాటిల్ చెప్పారు. తనను సంప్రదించిన వారిలో యడ్యూరప్ప, శ్రీరాములు, మురళీధర్ రావు ఉన్నారని తెలిపారు. బీసీ పాటిల్ వ్యాఖ్యలు బీజేపీని ఇరకాటంలోకి నెట్టాయి.
బీజేపీ ప్రభుత్వాన్ని నిలువరించడంలో విజయం సాధించినప్పటికీ… ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టేందుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదు. బీజేపీ నేతలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో మాట్లాడిన ఆడియోటేపులన్నీ ఒరిజినల్ అని, ఫోరెన్సిక్ ల్యాబ్ లో వాటిని టెస్ట్ చేయించాలని కాంగ్రెస్ నేత ఉగ్రప్ప డిమాండ్ చేశారు. ఈ అంశంపై అవసరమైతే కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా వరుస ఓటములతో డీలా పడ్డ కాంగ్రెస్ కు కర్నాటక పరిణామాలు కొత్త ఉత్సాహాన్నిచ్చాయి. అత్యంత క్లిష్టపరిస్థితుల్లో కర్నాటకాన్ని బీజేపీ చేజిక్కుంచుకోకుండా అడ్డుపడిన కాంగ్రెస్..ఈ విజయం స్ఫూర్తిగా బీజేపీని ఎదుర్కొనేందుకు కొత్త వ్యూహాలు సిద్ధం చేస్తోంది. కర్నాటక ఆడియో టేపులను దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తూ….బీజేపీపై వ్యతిరేకత పెంచాలన్నది కాంగ్రెస్ తాజా వ్యూహం. మరి బీజేపీ కాంగ్రెస్ వ్యూహాన్ని ఎలా తిప్పికొడుతుందో చూడాలి.