Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు బీజేపీ పరోక్షంగా క్షమాపణలు చెప్పింది. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో మన్మోహన్ ను ఉద్దేశించి ప్రధాని చేసిన వ్యాఖ్యలపై క్షమాపణచెప్పాలన్న డిమాండ్ తో కాంగ్రెస్ రాజ్యసభ సమావేశాలను అడ్డుకుంటున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభలో ప్రకటనచేశారు. మన్మోహన్ సింగ్ దేశభక్తిని, అంకిత భావాన్ని తాము ప్రశ్నించలేదని అరుణ్ జైట్లీ స్పష్టంచేశారు. ప్రధాని తన ప్రసంగాల్లో మన్మోహన్ సింగ్ ను, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీలను ఎక్కడా ప్రశ్నించలేదన్నారు. వారికి దేశం పట్ల ఉన్న నిబద్ధతపై తమకెలాంటి అనుమానాలూ లేవని వ్యాఖ్యానించారు.
అరుణ్ జైట్లీ ప్రకటనతో మన్మోహన్ కు బీజేపీ ప్రభుత్వం పరోక్షంగా క్షమాపణ చెప్పినట్టు అయిందని భావిస్తున్నారు.దీనిపై మన్మోహన్ స్పందించారు. రాజకీయ ప్రయోజనాల కోసం తనపై తప్పుడు ఆరోపణలు చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. మోడీ వ్యాఖ్యలు కేవలం రాజకీయ దురుద్దేశంతో చేసినవన్నారు. అరుణ్ జైట్లీ చెప్పిన క్షమాపణలు తన గౌరవాన్ని తిరిగి పెంచుతాయని మన్మోహన్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మన్మోహన్, హమీద్ అన్సారీలపై మోడీ తీవ్ర ఆరోపణలు చేశారు. గుజరాత్ ఎన్నికలపై ప్రభావం చూపేలా ఆయన వ్యాఖ్యానించారు. పాక్ దౌత్యాధికారులను మణిశంకర్ అయ్యర్ ఇంట్లో మన్మోహన్ కలుసుకున్నారని, పాక్ మాజీ మంత్రితో రహస్యంగా సమావేశమయ్యారని ఆరోపణలు గుప్పించారు. మోడీ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.