Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మహ్మదాలీజిన్నాను పొగిడేవాళ్లు సాధారణంగా ముస్లింలో, లేదంటే ముస్లిం ఓటర్లకు ప్రాతినిధ్యం వహించే పార్టీల నేతలో అయిఉంటారు. కానీ విచిత్రంగా కాషాయదళం నుంచి జిన్నాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అఖండ భారత్ ను తమ లక్ష్యంగా ప్రకటించుకునే బీజేపీ… దేశ విభజనకు కారణమైన మహ్మదాలీజిన్నాను పొగడడం దేశంలో హాట్ టాపిక్ గా మారింది. అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయంలో జిన్నా చిత్రపటం ఉంచడంపై వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్ బీజేపీ మంత్రి, బీజేపీ ఎంపీ జిన్నాను మహాపురుషుడుగా అభివర్ణించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయంలోని జిన్నా చిత్రపటాన్ని తొలగించాలంటూ బీజేపీ ఎంపీ సతీశ్ గౌతమ్ ఉపకులపతికి లేఖ రాశారు. దీనిపై స్పందించిన మరో బీజేపీ ఎంపీ సావిత్రిబాయి పూలే మాత్రం జిన్నాకు అనుకూలంగా స్పందించారు. పాకిస్థాన్ జాతి పిత అయిన జిన్నాను మహాపురుషుడు అని కొనియాడారు. జిన్నా గొప్ప వ్యక్తని, దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారని, ఆయన ఇప్పుడూ, ఎప్పుడూ గొప్ప వ్యక్తే అని సావిత్రిబాయి పూలే ప్రశంసించారు. ఉత్తర్ ప్రదేశ్ క్యాబినెట్ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య కూడా జిన్నాను మహాపురుషుడిగా అభివర్ణించారు. దేశ స్వాతంత్య్రం కోసం ఎన్నో త్యాగాలు చేసిన వారిని వేలెత్తి చూపడం సిగ్గుచేటని అన్నారు.