Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
2014 ఎన్నికల ముందు నుంచి గెలుపు కోసం బీజేపీ ఓ అరుదైన వ్యూహం రూపొందించింది. తనకు వున్న ఓటు బ్యాంకు పెంచుకోవడం మీద కాకుండా తన వ్యతిరేక ఓటు చీలిక కోసం పరోక్ష ప్రయత్నాలు చేయడం ఇందులో భాగం. కిందటి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ప్లాన్ సక్సెస్ అయ్యింది. ముఖాముఖీ పోరు కాకుండా త్రిముఖ లేదా చతుర్ముఖ పోటీ వున్న చోట ఈ ప్లాన్ బాగా వర్కౌట్ అయ్యింది. బీజేపీ వేసిన ఈ ఎత్తులో తెలిసో, తెలియకో ఆ పార్టీని తీవ్రంగా వ్యతిరేకించే ఎంఐఎం కూడా ఓ భాగం అయ్యింది. ఉత్తరాది లోని కొన్ని రాష్ట్రాల్లో ఎంఐఎం ఎన్నికల బరిలోకి దిగి బీజేపీ వ్యతిరేక ఓటు బ్యాంకు ని చీల్చింది. ఎంఐఎం వల్ల మైనారిటీ ఓట్లు చీలిపోయి వివిధ చోట్ల కాంగ్రెస్ లేదా బీజేపీ కి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రాంతీయ పక్షాలకు బాగా నష్టం జరిగింది. ఇప్పుడు కర్ణాటకలో కూడా అదే వ్యూహాన్ని అమలు చేసేందుకు బీజేపీ గట్టి ప్రయత్నమే చేసింది. దానికి తగ్గట్టే ఎంఐఎం కూడా అక్కడ ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించడంతో కాంగ్రెస్ ఓటు బ్యాంకు చీలిపోయే పరిస్థితి వచ్చింది.
బీజేపీ ఎత్తులకు పై ఎత్తు వేస్తున్న సీఎం సిద్ధ రామయ్య ఈసారి బీజేపీ పాచిక పారనివ్వలేదు. బీజేపీ కి అండగా ఉంటున్న హిందుత్వ వాదుల ఓటు బ్యాంకు చీల్చడానికి ఆయన కర్ణాటకలో శివసేన పోటీకి దిగేలా చేయగలిగారు. Nda లో వుంటూ కూడా బీజేపీ అంటే రగిలిపోతున్న శివసేన కర్ణాటకలో ఆ పార్టీ ని చావు దెబ్బ కొట్టేందుకు ఎన్నికల బరిలోకి దిగింది. అంతటితో వ్యూహం ఆగిపోలేదు. కర్ణాటకలో ఎంఐఎం కూడా ఎన్నికల బరి నుంచి తప్పుకునేలా ఒప్పించడంలో సిద్ధ రామయ్య సక్సెస్ అయ్యారు. అటు శివసేన మాత్రం యధావిధిగా ఎన్నికల బరిలో వుంది. దీంతో ఈ రెండు పార్టీల నిర్ణయం బీజేపీ ని కర్ణాటకలో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.